ఆర్టీసీ సిబ్బంది నిజమైన రవాణా యోధులు

డిజిటల్ సేవల వైపు టీజీఎస్ ఆర్టీసీ అడుగులు

హైద‌రాబాద్ : దేశ పురోగతి లోనూ, ప్రజా జీవనంలోనూ రవాణా వ్యవస్థల పాత్ర అత్యంత కీలకమైనదని అన్నారు ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి . తెలంగాణ‌ రాష్ట్ర ప్రగతి చక్రంలో టీజీఎస్ ఆర్టీసీ ఒక ప్రధాన శక్తిగా నిలుస్తూ రోజూ లక్షలాది మంది ప్రజలను సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుస్తోందని ఎండీ వెల్లడించారు. సరిహద్దుల్లో సైనికులు దేశాన్ని కాపాడుతుంటే, రోజూ వేకువజామునే లేచి ఎండనక, వాననక కోట్లాది మంది ప్రజలను చేరవేస్తున్న ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజ్ మెకానిక్‌లు, ఇతర సిబ్బందే నిజమైన రవాణా యోధులని ఆయన ప్రశంసించారు.

సంస్థ పట్ల ప్రజలు చూపుతున్న నమ్మకమే ఆర్టీసీకి నిజమైన బలమని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘మహాలక్ష్మి’ ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ఆర్టీసీ అత్యంత విజయవంతంగా అమలు చేస్తోందని ఎండీ చెప్పారు. మహిళలకు ఉచిత ప్రయాణంతో పాటు విద్యార్థులకు, దివ్యాంగులకు ఉచిత, రాయితీ పాస్‌లు అందిస్తూ సమాజంలో ప్రతి ఒక్కరూ ఆర్థికంగా ఎదిగేందుకు ఆర్టీసీ ఒక శక్తివంతమైన సాధనంగా మారిందన్నారు. మారే కాలానికి అనుగుణంగా ఆర్టీసీని ఆధునిక, పర్యావరణహిత వ్యవస్థగా తీర్చి దిద్దుతున్నామని నాగిరెడ్డి స్పష్టం చేశారు. ప్రయాణికుల సౌకర్యార్థం యూపీఐ, కార్డు చెల్లింపుల వంటి డిజిటల్ సేవలతో పాటు లైవ్ బస్ ట్రాకింగ్‌ను అందుబాటులోకి తెచ్చామన్నారు.

మహిళల భద్రతకు ప్రాధాన్యమిస్తూ బస్సుల్లో సీసీటీవీ కెమెరాలు, పానిక్ బటన్ల ఏర్పాటును వేగవంతం చేశామని వివరించారు. కాలుష్య నివారణ కోసం భారీగా ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశ పెడుతూనే, పాత బస్సుల స్థానంలో కొత్త సూపర్‌లగ్జరీ, ఎక్స్‌ప్రెస్ బస్సులను తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు, విస్తృతమైన మొక్కల పెంపకంతో ‘గ్రీన్ ఆర్టీసీ’ దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. గ్రామీణ కనెక్టివిటీని బలోపేతం చేస్తూనే, కార్గో , లాజిస్టిక్స్ సేవల ద్వారా సంస్థ ఆదాయ మార్గాలను పెంచుకుంటున్నామని వెల్లడించారు. సంస్థ అభివృద్ధిలో భాగస్వాములవుతున్న సిబ్బంది శ్రేయస్సే యాజమాన్యానికి అత్యంత ప్రాధాన్యమైన అంశమని ఎండీ పేర్కొన్నారు. ఉచిత ఆరోగ్య పరీక్షలు, వైద్య శిబిరాల ద్వారా ఉద్యోగుల ఆరోగ్యాన్ని సంరక్షిస్తూ, ప్రమాద రహితంగా బస్సులు నడిపే డ్రైవర్లను, ప్రతిభ చూపిన సిబ్బందిని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.

ఆర్టీసీ కేవలం ఒక ప్రభుత్వ సంస్థ కాదని, అది అందరి ఆస్తి అని గుర్తు చేశారు. ప్రజారవాణాను ప్రోత్సహించడం, బస్సులను, డిపోలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి ప్రాథమిక బాధ్యత అని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో అన్ని ప్రాంతాలకు సేవలను విస్తరించి, ప్రజాసేవలో టీజీఎస్ ఆర్టీసీని దేశంలోనే అగ్రగామిగా నిలబెడతామని సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు.

Leave A Reply

Your Email Id will not be published!