Smita Sabharwal Comment : ‘స్మితం’ సంచ‌ల‌నం

స‌డ‌న్ గా ప్ర‌త్య‌క్షం

Smita Sabharwal : ఎవ‌రీ స్మితం అనుకుంటున్నారా. తెలంగాణ రాష్ట్రంలో మోస్ట్ పాపుల‌ర్ సీనియ‌ర్ ఐఏఎస్ ఆఫీస‌ర్. సాధ్య‌మైనంత మేర‌కు చాలా మంది ఉన్న‌తాధికారులు కొలువు తీరినా కేసీఆర్ పాల‌నా కాలంలో ఎక్కువ‌గా ప్ర‌చారంలోకి వ‌చ్చిన ఏకైక పేరు స్మితా స‌బ‌ర్వాల్. ఆమె ఏది చెబితే అది క‌చ్చితంగా అయి పోతుంద‌నే స్థాయికి చేరుకున్నారు. కానీ కాలం ఊరికే ఉండ‌దు. అది ఎవ‌రినీ ఎప్పుడు ఆద‌రిస్తుందో ఎప్పుడు ఎవ‌రిని పాతాళానికి తొక్కేస్తుందో చెప్పలేం. దొర గ‌డీల పాల‌న‌లో కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తూ వ‌చ్చారు స్మితా స‌బ‌ర్వాల్(Smita Sabharwal). అనుకోని ప‌రిస్థితుల్లో బీఆర్ఎస్ ప్ర‌భుత్వానికి ప్ర‌జ‌లు చెక్ పెట్టారు.

రేవంత్ రెడ్డి సార‌థ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం కొలువు తీరింది. ఒక ర‌కంగా సీన్ పూర్తిగా మారి పోయింది. త‌న‌కు అనుకూలంగా ఉన్న అధికారుల‌ను రేవంత్ ఏరి కోరి తెచ్చుకుంటున్నారు. ఇది ప్ర‌భుత్వాలు మారిన‌ప్పుడు స‌ర్వ సాధార‌ణ విష‌యం. అయితే ఎక్కువ‌గా సామాజిక, ప్ర‌సార మాధ్య‌మాల‌లో స్మితా స‌బ‌ర్వాల్ హాట్ టాపిక్ గా మారారు. కార‌ణం నీటి పారుద‌ల రంగానికి సంబంధించి, ప్ర‌త్యేకించి కాళేశ్వ‌రం ప్రాజెక్టు, మిష‌న్ భ‌గీర‌థ ప్రాజెక్టుల‌లో అన్నీ తానై వ్య‌వ‌హ‌రించారు స్మితా స‌బ‌ర్వాల్.

Smita Sabharwal Comment Viral

ఆమె గురించి బ‌య‌ట‌కు ఆరోప‌ణ‌లు చేయ‌క పోయినా ఆనాడు సీఎం కేసీఆర్ కు భ‌య‌ప‌డి ఎవ‌రూ నోరు మెదిపే సాహ‌సం చేయ‌లేక పోయారు. ప్ర‌స్తుతం రేవంత్ రెడ్డి ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించినా దొర టీంగా పేరు పొందిన ఉన్న‌తాధికారులలో కొంద‌రు క‌లిసేందుకు ఇష్ట ప‌డ‌క పోవ‌డం ఒకింత విస్తు పోయేలా చేసింది. అయితే సీఎంను క‌ల‌వ‌క పోయినా గిరిజ‌న సంక్షేమ శాఖ మంత్రిగా సీత‌క్క బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ఈ స‌మ‌యంలో తళుక్కున మెరిసింది స్మితా స‌బ‌ర్వాల్(Smita Sabharwal).

అంతా ఒక్క‌సారిగా ఆశ్చ‌ర్యానికి లోన‌య్యారు. ఇదే క్ర‌మంలో త‌ను ట్విట్ట‌ర్ వేదిక‌గా చేసిన ట్వీట్ తీవ్ర దుమారానికి తెర తీసింది. తాను కేంద్ర స‌ర్వీసులోకి వెళుతున్న‌ట్లు చేస్తున్న ప్ర‌చారం త‌ప్ప‌ద‌ని పేర్కొంది. తాను ఇక్క‌డే ఉంటాన‌ని ఎక్క‌డికీ వెళ్ల‌నంటూ స్ప‌ష్టం చేసింది. ఆ మ‌ధ్య‌న గోవా టూర్ కు వెళ్లిన స‌మ‌యంలో త‌ను షేర్ చేసిన ఫోటోలు కొంత అభ్యంత‌ర‌కరంగా ఉన్నాయంటూ విమ‌ర్శ‌లు కూడా వ‌చ్చాయి. కానీ వాటిని ఏవీ ప‌ట్టించు కోలేదు స్మితా స‌బ‌ర్వాల్.

తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో ఆమె పాల‌నా అధికారిగా మంచి పేరు సంపాదించారు. మెద‌క్ జిల్లా క‌లెక్ట‌ర్ గా ప్ర‌జ‌ల మెప్పు పొందారు. 2001లో ట్రైనీ క‌లెక్ట‌ర్ గా విధుల్లో చేరిన స్మితా స‌బ‌ర్వాల్ అతి త‌క్కువ కాలంలోనే సీఎంఓ లో అద‌న‌పు కార్య‌ద‌ర్శిగా ప‌దోన్న‌తి పొందారు. ఆమె ప‌నితీరును మెచ్చి కేసీఆర్ ప్ర‌యారిటీ ఇచ్చార‌ని అప్ప‌ట్లో ప్ర‌చారం జ‌రిగింది. అంత‌కు ముందు ఏపీ కేడ‌ర్ కు చెందిన ఆమె ఆదిలాబాద్ ట్రైనీ క‌లెక్ట‌ర్ గా, చిత్తూరు జిల్లా అసిస్టెంట్ క‌లెక్ట‌ర్ గా , డీఆర్డీఏ పీడీగా, వ‌రంగ‌ల్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ క‌మిష‌న‌ర్ గా , వైజాగ్ లో వాణిజ్య ప‌న్నుల శాఖ‌లో డిప్యూటీ క‌మిష‌న‌ర్ గా విధులు చేప‌ట్టారు. క‌ర్నూల్ జిల్లా జేసీగా కూడా ప‌ని చేశారు. అనంత‌రం హైద‌రాబాద్ లో జేసీగా, క‌రీంన‌గ‌ర్ లో క‌లెక్ట‌ర్ గా ప‌ని చేశారు. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల ఆదారాభిమానాలు పొందారు.

ఆమె మార్కెటింగ్ శాఖ లో కూడా ప‌ని చేశారు. కీల‌క మార్పులు తీసుకు వ‌చ్చారు. ఉద్య‌మ స‌మ‌యంలో అమ‌ర వీరుల బిడ్డ‌ల త‌ల్లుల‌ను స‌న్మానించారు. ఆ త‌ర్వాత సీఎంవోలోకి వ‌చ్చాక స్మితా స‌బ‌ర్వాల్ దూకుడు పెంచార‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. అదే స‌మ‌యంలో సీఎంతో పాటు త‌ను కూడా హెలికాప్ట‌ర్ లో ప‌ర్య‌టించ‌డం విస్తు పోయేలా చేసింది. మొత్తంగా స్మితా ఒక అధికారిగా కంటే ఒక పొలిటిక‌ల్ లీడ‌ర్ గా వ్య‌వ‌హ‌రించింద‌న్న అప‌వాదు మూట‌గ‌ట్టుకుంది. ఏది ఏమైనా ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటూ సేవ‌లు అందించాల్సిన ఐఏఎస్ లు ఇలా వ్య‌వ‌హ‌రించ‌డం మంచి ప‌ద్ద‌తి కాద‌న్న అభిప్రాయం అంత‌టా వ్య‌క్తం అవుతోంది.

Also Read : Diya Kumari Comment : రాజ సౌధం వీడిన రాజ‌కుమారి

Leave A Reply

Your Email Id will not be published!