YS Sharmila : స్కూటర్ మీద తిరిగినోడు విమానాలు కొంటుండు
సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగిన వైఎస్ షర్మిల
YS Sharmila : వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆమె జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రజా ప్రస్థానం పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా షర్మిల ప్రసంగించారు. గత కొంత కాలంగా షర్మిల సీఎం కేసీఆర్ , ఆయన ఫ్యామిలీని టార్గెట్ చేశారు. దేశంలోనే అత్యంత అవినీతి పాలన సాగిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఆరోపించారు.
ఒకప్పుడు స్కూటర్ మీద తిరిగిన కేసీఆర్ ఇప్పుడు విమానాలు కొనే స్థాయికి ఎలా ఎదిగాడని ప్రశ్నించారు. ఏం కష్టం చేసిండని ఇన్ని కోట్లు సంపాదించాడని నిలదీశారు. తెలంగాణ రాష్ట్రంలో ఒక్క కల్వకుంట్ల కుటుంబం తప్ప ఏ ఒక్క ఫ్యామిలీ బాగు పడిన దాఖలాలు లేవని ఎద్దేవా చేశారు.
భూపాలపల్లి ఎమ్మెల్యే కోట్లకు పడుగలు ఎత్తాడని , ఇంకెంత కాలం ప్రజలను పీల్చి పిప్పి చేస్తారంటూ మండిపడ్డారు వైఎస్ షర్మిల(YS Sharmila). దాచు కోవడం, దోచు కోవడం మీద ఉన్నంత శ్రద్ద కేసీఆర్ కు ఆయన పార్టీకి సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, చైర్మన్లు, జెడ్పీటీసీలకు ప్రజా సమస్యలు పట్టించు కోవడం లేదని ద్వజమెత్తారు.
పాలకులు నిద్ర పోతుంటే పోలీసులు ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు లేనే లేవన్నారు. ఉన్నది ఒక్కటే తమ పార్టీ తప్ప ఇంకే పార్టీ లేదన్నారు వైఎస్ షర్మిల. కాంగ్రెస్, బీజేపీ, కమ్యూనిస్టు పార్టీలు ప్రశ్నించడం లేదని మండిపడ్డారు. అంతకు ముందు షర్మిల మాధవరావుపల్లి, బొబ్బిలోనిపల్లి, బస్వరాజు పల్లి, ధర్మారావుపేట గ్రామాలలో పర్యటించారు.
Also Read : గ్రూప్స్ లో మరిన్ని పోస్టులకు సర్కార్ ఓకే