Sukirtharani Comment : ‘అదానీ’ స్పాన్సర్..అవార్డు డోంట్ కేర్
తమిళ దళిత కవయిత్రి సుకీర్తారాణి
Sukirtharani Comment : ఈ దేశంలో అవార్డులు, పురస్కారాలకు కొదవ లేదు. ఎవరి దుకాణం వారిదే. ఎవరి డబ్బా వారిదే. ప్రచారమే పరమావధిగా కొనసాగుతున్న తరుణంలో ఏ అవార్డుకు కొలమానం అంటూ లేకుండా పోయింది. కానీ ఇంకా సమాజం కోసం, ప్రజల కోసం , వారి తరపున రాసే కవులు, కళాకారులు, రచయితలు, దర్శకులు, నటీ నటులు , సృజనకారులు, ఆర్టిస్టులు కొంత మంది ఉన్నారు.
సున్నితంగా ప్రభుత్వం తరపున ఇచ్చే వాటిని తిరస్కరించిన వాళ్లు ఉన్నారు. ఇది పక్కన పెడితే దేశ ప్రధానమంత్రి , బీజేపీ, హిందూ సంస్థలు నెత్తిన పెట్టుకుని ఊరేగుతున్న బడా బిలియనీర్ అదానీ చైర్మన్ గా ఉన్న అదానీ సంస్థకే షాక్ ఇచ్చింది ఓ కవయిత్రి.
ఇప్పుడు ఆమె ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తికరంగా మారారు. ఎవరని అనుకుంటున్నారా తమిళనాడుకు చెందిన దళిత సామాజిక వర్గానికి చెందిన కవయిత్రి (కవి) సుకీర్తారాణి. ఆమె సాహిత్యంలో చేసిన కృషికి గాను ప్రతిష్టాత్మకమైన దేవి అవార్డుకు ఎంపికైంది.
ఈ సందర్భంగా పురస్కారానికి సంబంధించిన కార్యక్రమానికి స్పాన్సర్ గా అదానీ గ్రూప్ చేపట్టింది. దీంతో విషయం తెలుసుకున్న సుకీర్తా రాణి(Sukirtharani) వెంటనే తనకు ఆ అవార్డు వద్దని ప్రకటించింది.
దేశంలోని వనరులను దోచుకుంటూ , ప్రభుత్వాన్ని, పాలకులను అడ్డం పెట్టుకుని వ్యాపారం చేస్తూ కోట్లకు పడగలు ఎత్తుతూ ప్రజలను బిచ్చగాళ్లుగా , శ్రామికులుగా మార్చేస్తున్న అదానీ సంస్థ స్పాన్సర్ చేసే ఏ అవార్డు తనకు అక్కర్లేదని స్పష్టం చేసింది. చెంప ఛెల్లుమనిపించింది.
ఈ సందర్భంగా కవయిత్రి చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారాయి. చర్చకు దారితీశాయి. వ్యవస్థలను నిర్వీర్యం చేసే ఏ సంస్థతోనైనా తాను రాజీ పడే ప్రసక్తి ఉండదని కుండ బద్దలు కొట్టింది సుకీర్తారాణి.
దేవి అవార్డును అందుకోవడం అంటే తన సిద్దాంతాలకు , రచనలకు , నా భావ జాలానికి , తాత్వికతకు పూర్తిగా విరుద్దమని పేర్కొంది. కుల వ్యవస్థ, స్త్రీల అణచివేతపై గత కొంత కాలం నుంచీ ఆమె సాహిత్య పరంగా ప్రశ్నిస్తూ..నిలదీస్తూ వస్తోంది.
ఒక వేళ నేను దేవి అవార్డును అంగీకరిస్తే నా సూత్రాలు, రాసిన రచనలు, ఇప్పటి వరకు నేను ఏర్పాటు చేసుకున్న నా తత్వానికి పూర్తిగా విరుద్దం అవుతుంది.
ఒక రకంగా నేను ఉన్నా చని పోయినట్టేనని పేర్కొంది సుకీర్తా రాణి(Sukirtharani). ఆమె తమిళనాడు లోని రాణిపేట్ జిల్లాలోని ప్రభుత్వ బడిలో సామాజిక కార్యకర్తగా ,తమిళ భాష టీచర్ గా ఉన్నారు.
దళిత సాహిత్యానికి ఆమె చేసిన కృషికి గాను ఆర్గనైజర్ , ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ కలిసి దేవి అవార్డుకు ఎంపిక చేశాయి. ఈ అవార్డులను మాజీ పోలీస్ ఆఫీసర్ కిరణ్ బేడీ అందించారు.
నన్ను ఎంపిక చేసినందుకు గౌరవిస్తాను. కానీ స్పాన్సర్ చేస్తున్నది అదానీ గ్రూప్ కాబట్టి తిరస్కరిస్తున్నానని ప్రకటించింది సుకీర్తారాణి(Sukirtharani).
ఏది ఏమైనా ఆమె చేసిన ఈ ప్రకటన , తీసుకున్న నిర్ణయం దేశంలో సంచలనం కలిగించింది. యావత్ మహిళా లోకం ఆమెకు సలాం చేస్తోంది.
Also Read : సామరస్యం భారత్ డీఎన్ఏలో ఉంది
