Parveta Uthsavam : తిరుమలలో ఘనంగా పార్వేట ఉత్సవం
ప్రతీ విషయాన్ని రాజకీయం చేస్తే ఎలా
Parveta Uthsavam : తిరుమల – తిరుమలలో శ్రీ మలయప్ప స్వామి వారి పార్వేట ఉత్సవం ఘనంగా జరిగింది. పార్వేట ఉత్సవం సాధారణంగా మకర సంక్రాంతి మరుసటి రోజైన కనుమ పండుగ నాడు జరుగుతుంది. ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి మీడియాతో మాట్లాడారు.
Parveta Uthsavam in Tirumala
అత్యంత ప్రాచీనమైన, కూలడానికి సిద్ధంగా ఉన్న పార్వేట మండపాన్ని టీటీడీ అధికారులు అదే రీతిలో పునర్నిర్మించారని, భక్తులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. అయితే, ప్రతి ఒక్క విషయాన్ని రాజకీయ కోణంలో చూసి విమర్శించడం సరైన చర్య కాదని, అది పాజిటివ్ దృక్కోణమా, నెగెటివ్ దృక్కోణమా అన్నది ఆత్మ విమర్శ చేసుకోవాలని సూచించారు.
సద్విమర్శలు మాత్రమే చేయాలని, భగవంతునికి సంబంధించిన విషయాలలో అవి సలహాలుగా మాత్రమే ఉండాలన్నారు. టీటీడీలోని అర్చకులు, ఆగమ పండితులు, ఉన్నతాధికారులు చక్కగా పని చేస్తారని చెప్పారు. దురుద్దేశంతో మనకు వచ్చిన ఆలోచన మాత్రమే చాలా శాస్త్రీయమైనదని, మనం ఒక్కరమే గొప్పగా విమర్శలు చేయగలమని ఎవరైనా భావిస్తే అది చాలా తప్పిదం అవుతుందని చెప్పారు.
ఇలా వ్యవహరించడం చాలా బాధాకరమన్నారు. టీటీడీలోని అధికారులు ఎంతో భక్తితో పనిచేస్తారని, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు తపన పడుతుంటారని అన్నారు. వందల సంవత్సరాల కాలం నాటి నిర్మాణాలను ఉపయోగించకుండా ఉన్నప్పుడు కాపాడు కోవడం తేలికని, వాటిని ప్రతిసారీ ఉపయోగించాల్సి వచ్చినప్పుడు ప్రయోగాలు చేయకూడదని వివరించారు.
పార్వేట మండపం చాలా పాతదని, కూలిపోయే స్థితిలో ఉండగా, చక్కగా పునర్నిర్మించారని, భక్తులందరూ అభినందిస్తున్నారని చెప్పారు. టీటీడీకి సంబంధించి విమర్శలు చేస్తే ఒక సలహా రూపంగా ఉండాలి కానీ, ఎదుటి వారిపై దాడి చేసేలా ఉండ కూడదని, వ్యక్తిగత ప్రతిష్ట కోసం ఏం మాట్లాడినా చెల్లుతుందని భావిస్తే భగవంతుని పట్ల అపచారం చేసినవారవుతారని అన్నారు.
టీటీడీ(TTD) ఈవో ఎవి.ధర్మారెడ్డి మాట్లాడుతూ ఈ సంవత్సరం నూతన మండపంలో పార్వేట ఉత్సవం చేయడం చాలా ఆనందదాయకమన్నారు. పాత మండపం శిథిలావస్థకు చేరుకుందని, మరమ్మతులు చేయడానికి కూడా అవకాశం లేని పరిస్థితుల్లో దీన్ని జీర్ణోద్ధరణ చేసినట్టు తెలిపారు. పాత మండపంలోని కళాఖండాలను రికార్డు చేసి యధావిధిగా తిరిగి నిర్మించామని, నూతన మండపం అద్భుతంగా వచ్చిందని చెప్పారు.
Also Read : Varla Ramaiah : ఏపీ బీహార్ లా మారింది – రామయ్య
