MLC Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు !
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు !
MLC Kavitha: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేసారు. ఈ నెల 26న ఢిల్లీ సీబీఐ విభాగం ఎదుట విచారణకు హాజరు కావాలంటూ ఆమెకు జారీచేసిన నోటీసుల్లో పేర్కొంది. ఢిల్లీలో మద్యం అమ్మకాలకు సంబంధించి అక్కడి ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీలో అనేక అక్రమాలు జరిగాయని, అమ్మకందారులకు లబ్ధి చేకూర్చేలా దీన్ని రూపొందించారన్న అరోపణలపై తొలుత సీబీఐ కేసు నమోదు చేసింది. ఇందులో పెద్దఎత్తున డబ్బులు చేతులు మారినట్లు సీబీఐ పేర్కొంది. నిధుల మళ్లింపునకు సంబంధించి ఈడీ కూడా మరో కేసు నమోదు చేసి సమాంతరంగా దర్యాప్తు జరుపుతోంది. గత ఏడాది ఫిబ్రవరి 26న అప్పటి ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను అరెస్టు చేశారు. మద్యం అమ్మకాల్లో కీలకంగా మారిన సౌత్ కార్టల్ తరఫున కవిత కీలకంగా వ్యవహరించారని… మద్యం వ్యాపారులతో కలిసి పలుమార్లు సమావేశాలు నిర్వహించారని… ఇదే పనిమీద పలుమార్లు ఢిల్లీ కూడా వచ్చారని సీబీఐ, ఈడీల విచారణలో తేలింది.
MLC Kavitha Got Notices
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవిత ఛార్టర్డ్ ఎకౌంటెంట్ బుచ్చిబాబు… ఆమె తరఫున ప్రతినిధులుగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో వైసీపీ ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు మాగుంట రాఘవరెడ్డి, అరుణ్ రామచంద్ర పిళ్లై, శరత్‌చంద్రారెడ్డి, అభిషేక్ బోయినపల్లిలను గతంలో ఈడీ అరెస్టు చేసింది. వీరిలో మాగుంట రాఘవరెడ్డి, శరత్ చంద్రారెడ్డిలు అప్రూవర్ లుగా మారగా వారిద్దరికీ బెయిల్ లభించింది. తన భార్యకు ఆరోగ్యం బాగాలేదని రామచంద్ర పిళ్లై అభ్యర్థన మేరకు న్యాయస్థానం అతనికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మిగతావారు ఇంకా జైల్లోనే ఉన్నారు. దర్యాప్తులో భాగంగా సీబీఐ అధికారులు హైదరాబాద్ వచ్చి కవితను(Kavitha) ఆమె ఇంట్లో ప్రశ్నించారు. ఈడీ అధికారులు మాత్రం రెండుసార్లు ఢిల్లీ పిలిపించి విచారించారు. అయితే మహిళను ఇంట్లోనే విచారించాలని చట్టంలో వెసులుబాటు ఉందని ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఈ నెల 28కి కేసును వాయిదా వేసింది. ఈలోపే సీబీఐ కవితకు నోటీసులు జారీ చేయడం, విచారణకు హాజరు కావాలని పేర్కొనడం కలకలం రేపుతోంది. దీనిపై ఆమె న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read : Satya Pal Malik: మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ నివాసంలో సీబీఐ సోదాలు !