Vande Bharat: వందే భారత్‌ లో ప్రయాణికుడిపై ఎమ్మెల్యే అనుచరుల దాడి

వందే భారత్‌ లో ప్రయాణికుడిపై ఎమ్మెల్యే అనుచరుల దాడి

Vande Bharat : సీటు మారేందుకు నిరాకరించిన వ్యక్తిపై ఎమ్మెల్యే అనుచరులు దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దిల్లీ-భోపాల్‌ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో గురువారం ఈ ఘటన జరగ్గా… దీనికి సంబంధించిన వీడియో తాజాగా వెలుగులోకి రావడంతో వైరల్‌ గా మారింది. ఈ ఘటనలో గాయపడిన ప్రయాణికుడిపైనే తిరిగి కేసు బనాయించడం గమనార్హం.

Vande Bharat – MLA Followers Fight

ఉత్తర్‌ ప్రదేశ్‌ లోని ఝాన్సీకి చెందిన బీజేపీ ఎమ్మెల్యే రాజీవ్‌ సింగ్‌… గత వారం తన సొంత నియోజకవర్గానికి కుటుంబ సభ్యులతో కలిసి వందే భారత్‌లో (Vande Bharat) ప్రయాణించారు. ఈ క్రమంలో భార్య, కుమారుడికి కంపార్ట్‌ మెంట్‌ ముందు వరుసలో సీట్లు రాగా… ఎమ్మెల్యేకి వేరే చోట సీటు వచ్చింది. ఈ క్రమంలో తన భార్యాబిడ్డలతో కలిసి ప్రయాణించేందుకు ఆ పక్కనే ఉన్న ప్రయాణికుడిని ఎమ్మెల్యే కోరగా… అందుకు నిరాకరించాడు. ఇది జరిగిన కాసేపటికే ఝాన్సీ స్టేషన్‌లో ఎమ్మెల్యే మనుషులు ట్రైన్‌ ఎక్కి ఆ ప్రయాణికుడిపై పిడిగుద్దుల వర్షం కురిపించారు. ఆరుగురు వ్యక్తులు ప్రయాణికుడిని సీట్లోనే చెప్పులతో దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి బయటికొచ్చింది.

దాడి ఘటనలో భోపాల్‌ వెళ్తున్న సదరు ప్రయాణికుడు గాయపడ్డాడు. ముక్కు నుంచి రక్తం కారుతూ, దుస్తులపై రక్తం మరకలతో ఆ వ్యక్తి కనిపించాడు. సీటు విషయంలో తలెత్తిన వివాదంతోనే ఈ ఘటన చోటుచేసుకుందని రైల్వే సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ విపుల్‌ కుమార్‌ ధ్రువీకరించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అయితే, ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేసేందుకు ప్రయాణికుడు నిరాకరించగా… తన కుటుంబ సభ్యుల పట్ల అమర్యాదగా ప్రవర్తించాడని సింగ్‌ ఇచ్చిన ఫిర్యాదుతో ఝాన్సీలోని గవర్నమెంట్‌ రైల్వే పోలీసులు అతడిపై కేసు నమోదు చేయడం కొసమెరుపు.

Also Read : Bomb Threat: ప్రియుడు మీద కోపంతో భగ్నప్రేమికురాలి బాంబు బెదిరింపులు

Leave A Reply

Your Email Id will not be published!