Minister Rao Inderjit Singh: ఆశావ‌హ జిల్లాల అభివృద్ధికి అన్నివిధాలా స‌హ‌క‌రిస్తాం – కేంద్ర మంత్రి రావు ఇంద్ర‌జిత్ సింగ్‌

ఆశావ‌హ జిల్లాల అభివృద్ధికి అన్నివిధాలా స‌హ‌క‌రిస్తాం - కేంద్ర మంత్రి రావు ఇంద్ర‌జిత్ సింగ్‌

Rao Inderjit Singh : ఆశావ‌హ జిల్లాల(ఏస్పిరేష‌న‌ల్ జిల్లాలు) అభివృద్ధికి కేంద్ర ప్ర‌భుత్వం అన్నివిధాలా అండ‌గా వుంటుంద‌ని కేంద్ర ప్లానింగ్, సాంస్కృతిక శాఖ స‌హాయ‌మంత్రి రావు ఇంద్ర‌జిత్ సింగ్ (Rao Inderjit Singh) తెలిపారు. ఆయా జిల్లాల ప్ర‌త్యేక అభివృద్ధి అవ‌స‌రాల‌పై త‌న‌కు నివేదిక అంద‌జేస్తే కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాల ద్వారా ఆయా జిల్లాల‌కు నిధులు మంజూరు చేసేందుకు ప్ర‌య‌త్నిస్తాన‌ని చెప్పారు. ఆశావ‌హ‌ జిల్లాల్లో వివిధ రంగాల్లో సాధించిన ప్ర‌గ‌తిపై అల్లూరి సీతారామ‌రాజు, పార్వ‌తీపురం (Parvathipuram) మ‌న్యం జిల్లా క‌లెక్ట‌ర్ లు ఏ.ఎస్‌.దినేష్ కుమార్‌, ఏ.శ్యాంప్ర‌సాద్ లు చేసిన ప్ర‌జంటేష‌న్ ప‌ట్ల సంతృప్తి వ్య‌క్తంచేస్తూ వివిధ కార్య‌క్ర‌మాల అమ‌లులో వుండే లోటుపాట్ల‌ను స‌రిదిద్దుకొని ఆయా జిల్లాలు రానున్న రోజుల్లో ఇదే స్థాయిలో ప్ర‌గ‌తిప‌థంలో ముంద‌కు వెళ్లాల‌ని ఆకాంక్షించారు.

Minister Rao Inderjit Singh Comments

ఏస్పిరేష‌న‌ల్ జిల్లాల కార్య‌క్ర‌మంలో భాగంగా నీతి ఆయోగ్ గుర్తించిన ఏ.ఎస్‌.ఆర్‌., పార్వ‌తీపురం (Parvathipuram) మ‌న్యం జిల్లాలు విద్య‌, ఆరోగ్య‌, వ్య‌వ‌సాయ‌, మౌళిక వ‌స‌తులు, ఆర్ధిక అభివృద్ధి త‌దిత‌ర అంశాల్లో సాధించిన ప్ర‌గ‌తిని కేంద్ర మంత్రి ఇంద్ర‌జిత్ సింగ్ (Rao Inderjit Singh) శుక్ర‌వారం విశాఖ‌ప‌ట్నంలోని (Visakhapatnam) క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో ఆయా జిల్లాల క‌లెక్ట‌ర్‌ల‌తో స‌మీక్షించారు. ఈ అంశాల్లో 49 ముఖ్య ప‌నితీరు సూచిక‌ల్లో ఆయా జిల్లాలు గ‌త రెండేళ్ల కాలంలో సాధించిన ప్ర‌గ‌తిని రెండు జిల్లాల క‌లెక్ట‌ర్‌లు ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జంటేష‌న్ ద్వారా వివ‌రించారు. నీతిఆయోగ్ జిల్లాల‌కు కేటాయించిన నిధుల వినియోగంపై కూడా వారు తెలిపారు. ప్ర‌స్తుత ఆర్ధిక సంవ‌త్స‌రంలో త‌మ జిల్లాల్లో ఆయా రంగాల్లో మెరుగుద‌ల‌కు చేప‌ట్ట‌నున్న కార్య‌క్ర‌మాల‌ను పేర్కొన్నారు. ఆయా జిల్లాల ప్ర‌త్యేక అవ‌స‌రాల‌ను, అభివృద్ధిలో నిధుల ప‌రంగా ఎదుర‌వుతున్న ఆర్ధిక‌ ఇబ్బందులను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు.

ఏ.ఎస్‌.ఆర్‌.జిల్లాను పూర్తిగా సేంద్రీయ ఉత్ప‌త్తుల జిల్లాగా రూపొందించాల‌ని భావిస్తున్నామ‌ని క‌లెక్ట‌ర్ ఏ.ఎస్‌.దినేష్ కుమార్ చెప్పారు. జిల్లాలో త‌యార‌య్యే వ్య‌వ‌సాయ‌, ఉద్యాన సంబంధ ఉత్ప‌త్తుల‌న్నింటికీ ఒకే బ్రాండ్ ఏర్పాటుచేసి ఆయా ఉత్ప‌త్తుల‌ను మార్కెట్‌లోకి విడుద‌ల చేయాల‌ని భావిస్తున్న‌ట్టు తెలిపారు. ఏజెన్సీ ప్రాంతంలోని కొన్ని పాఠ‌శాల‌ల్లో క్రీడాభివృద్ధి కేంద్రాలుగా అభివృద్ధి చేసి ఆయా స్కూళ్ల‌లో విద్య‌తోపాటు క్రీడ‌ల‌పై కూడా ప్ర‌త్యేక శిక్ష‌ణ ఇవ్వ‌నున్న‌ట్టు చెప్పారు. ఒక్కో పాఠ‌శాల‌ను ఒక్కో క్రీడాంశంలో శిక్ష‌ణ‌కు ఎంపిక‌చేసి శిక్ష‌ణా సౌక‌ర్యాలు క‌ల్పిస్తామ‌న్నారు. దీనికి అవ‌స‌ర‌మైన నిధుల‌ను నీతిఆయోగ్ ద్వారా ఏస్పిరేష‌న‌ల్ జిల్లాల కార్య‌క్ర‌మం కింద మంజూరు చేయాల‌ని కోరారు. ప్ర‌స్తుత త‌రం గిరిజ‌న విద్యార్ధులు క‌నీసం ఇంట‌ర్మీడియెట్ స్థాయి వ‌ర‌కు విద్య‌ను పూర్తిచేసే విధంగా కార్యాచ‌ర‌ణ రూపొందించామ‌ని క‌లెక్ట‌ర్ పేర్కొన్నారు.

ఏ.ఎస్‌.ఆర్‌. జిల్లాలో గిరిజ‌న ప్రాంతాల్లో సాగునీటికి ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయ‌ని క‌లెక్ట‌ర్ పేర్కొన్నారు. కేవ‌లం చెక్ డ్యాంల‌పైనే ఆధార‌ప‌డి పంట‌లు పండించే ప‌రిస్థితి వుంద‌న్నారు. జాతీయ ఉపాధిహామీ పథ‌కం నిధుల‌తోనే ప్ర‌స్తుతం చెక్‌డ్యాంల మ‌ర‌మ్మ‌త్తులు, కొత్త చెక్‌డ్యాంల నిర్మాణం చేప‌డుతున్నామ‌ని, కేంద్ర ప్ర‌భుత్వం ఏదైనా ప‌థ‌కం కింద చెక్‌డ్యాంల మ‌ర‌మ్మ‌త్తులు, నిర్మాణానికి నిధులు మంజూరు చేయాల‌ని లేన‌ట్ల‌యితే చెక్‌డ్యాంల నిర్మాణం కోసం ప్ర‌త్యేకంగా నిధులు కేటాయించాల‌ని కోరారు. దీనిని ప‌రిశీలిస్తామ‌ని కేంద్ర మంత్రి చెప్పారు. జిల్లాలో మౌళిక వ‌స‌తుల అభివృద్దిలో భాగంగా క‌మ్యూనికేష‌న్ల వ్య‌వ‌స్థ మెరుగుప‌ర‌చ‌డంలో భాగంగా 1591 మొబైల్ ట‌వ‌ర్లు మంజూరుకాగా వీటిలో 1456 ట‌వ‌ర్ల‌ను ఇప్ప‌టికే ఏర్పాటుచేసి 1267 ట‌వ‌ర్ల‌ను రేడియేట్ చేయ‌డం జ‌రిగింద‌న్నారు.

పార్వ‌తీపురం – మ‌న్యం జిల్లా వైద్య‌, ఆరోగ్య‌, విద్యా, వ్య‌వ‌సాయ రంగాల్లో సాధించిన ప్ర‌గ‌తిపై జిల్లా క‌లెక్ట‌ర్ ఏ.శ్యాంప్ర‌సాద్ ప్ర‌జంటేష‌న్ ఇచ్చారు. పారిశ్రామికాభివృద్ధిలో జిల్లా వెనుక‌బ‌డి వుంద‌ని, జిల్లాలో సూక్ష్మ‌స్థాయి ప‌రిశ్ర‌మలు మిన‌హా మ‌ధ్య‌త‌ర‌హా, భారీ ప‌రిశ్ర‌మ‌లు ఏవీ లేవ‌న్నారు. దీనిని అధిగ‌మించేందుకు సాంకేతిక విద్య అవ‌కాశాలు పెంపొందించేలా ఐ.టి.ఐ.లు, సాంకేతిక విద్యా సంస్థ‌లు అధికంగా ఏర్పాటు చేయాల్సి వుంద‌న్నారు. జిల్లాలో నైపుణ్యాభివృద్ధి శిక్ష‌ణ కార్య‌క్ర‌మాల నిర్వ‌హ‌ణ‌కు అధిక ప్రాధాన్య‌త ఇస్తున్నామ‌న్నారు. జిల్లాలో కేవ‌లం 15 కిలోమీట‌ర్లు మాత్ర‌మే జాతీయ ర‌హ‌దారులు వున్నాయ‌ని, అందువ‌ల్ల కొన్ని రాష్ట్ర ర‌హ‌దారుల‌ను జాతీయ ర‌హ‌దారులుగా మార్పుచేసి అభివృద్ధి చేయాల‌ని కోరారు. పార్వ‌తీపురంలో (Parvathipuram) మ‌ల్టీప‌ర్ప‌స్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటుకు అవ‌స‌ర‌మైన నిధులు మంజూరు చేయాల‌ని కేంద్ర మంత్రిని కోరారు. జిల్లాలో ప‌ర్యాట‌క వ‌స‌తుల క‌ల్ప‌న‌కు అవ‌స‌ర‌మైన నిధుల‌ను మంజూరు చేయాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.

పార్వ‌తీపురం (Parvathipuram) ఎమ్మెల్యే బోనెల విజ‌యచంద్ర మాట్లాడుతూ జిల్లాలో ఉన్న‌త విద్యా సంస్థ‌లు లేవ‌ని, అందువ‌ల్ల కేంద్ర ప్ర‌భుత్వం ఉన్న‌త విద్యావ‌కాశాలు పెంపొందించేందుకు త‌గిన చ‌ర్య‌లు చేప‌ట్టాల‌న్నారు. కేంద్ర ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో ఏక‌ల‌వ్య, కెజిబివి, కేంద్రీయ విద్యాల‌య వంటి సంస్థ‌ల‌ను ఏర్పాటు చేయాల‌ని కోరారు. అదేవిధంగా జిల్లాలో వైద్య నిపుణులు కూడా అందుబాటులో లేర‌ని, అందువ‌ల్ల ఏ అవ‌స‌రం వ‌చ్చిన విశాఖ‌కు వెళ్లాల్సి వ‌స్తోంద‌ని, నీతిఆయోగ్ ద్వారా జిల్లా కేంద్రంలో ఆధునిక వైద్య సదుపాయాల క‌ల్ప‌న‌కు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని కోరారు. పాల‌కొండ ఎమ్మెల్యే నిమ్మ‌క జయ‌కృష్ణ‌, ఏ.ఎస్‌.ఆర్‌. జాయింట్ క‌లెక్ట‌ర్ అభిషేక్ గౌడ‌, రంప‌చోడ‌వ‌రం పి.ఓ. కె.సింహాచ‌లం, చింతూరు పి.ఓ. అపూర్వ భ‌ర‌త్‌, ట్రైనీ స‌హాయ క‌లెక్ట‌ర్ సాహిత్‌, పార్వ‌తీపురం పి.ఓ. శ్రీ‌వాత్స‌వ‌, రెండు జిల్లాల అధికారులు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా అర‌కు కాఫీపై ఏర్పాటుచేసిన ప్ర‌త్యేక స్టాల్‌ను కేంద్ర మంత్రి ఇంద్ర‌జిత్ సింగ్ (Rao Inderjit Singh) ప‌రిశీలించారు. ఏ.ఎస్‌.ఆర్ క‌లెక్ట‌ర్ దినేష్ కుమార్ ఆయ‌న‌కు అర‌కు కాఫీ ప్ర‌త్యేక‌త‌ల‌ను, ఈ ఉత్ప‌త్తి మార్కెటింగ్ కోసం చేస్తున్న ఏర్పాట్ల‌ను వివ‌రించారు. కేంద్ర మంత్రికి అర‌కు కాఫీ ప్యాకెట్‌తో పాటు చింతూరు ఏజెన్సీ ప్రాంతంలోని కూన‌వ‌రం మండ‌లం పైడిపాలెం గ్రామానికి చెందిన గిరిజ‌న మ‌హిళ‌లు చేతితో రూపొందించిన ప‌ట్టు చీర‌ను బ‌హూకరించారు. ట‌స్సార్ సిల్క్ గా ఈ ప‌ట్టుకు గ‌ల ప్ర‌త్యేక‌త‌ను, ఈ చీర త‌యారీ విధానాన్ని చింతూరు ఐ.టి.డి.ఏ. ప్రాజెక్టు అధికారి అపూర్వ భ‌ర‌త్ కేంద్ర మంత్రికి వివ‌రించారు. దీనికి మంత్రి ప్ర‌శంస‌లు అందిస్తూ వాటిని ప్రోత్స‌హిస్తున్న అధికారుల‌ను అభినందించారు. పార్వ‌తీపురం జిల్లా క‌లెక్ట‌ర్ ఏ.శ్యాంప్ర‌సాద్‌, ఎమ్మెల్యేలు విజ‌య‌చంద్ర‌, జ‌య‌కృష్ణ కూడా కేంద్ర‌మంత్రికి జ్ఞాపిక‌లు బ‌హూక‌రించారు.

Also Read : Ashok Gajapathi Raju: టీడీపీకి మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు రాజీనామా

Leave A Reply

Your Email Id will not be published!