Missing: వీడిన తిరువూరు ఏఈఈ మిస్సింగ్ మిస్టరీ

వీడిన తిరువూరు ఏఈఈ మిస్సింగ్ మిస్టరీ

Missing : ఏపీలో సంచలనం సృష్టించిన జలవనరులశాఖ తిరువూరు ఏఈఈ వి.కిషోర్‌ అదృశ్యం కేసు మిస్టరీ వీడింది. రాజమహేంద్రవరంలో గోదావరి ఒడ్డున ఆత్మహత్యకు యత్నిస్తున్న క్రమంలో…. కిషోర్‌ ను పోలీసులు గుర్తించి కాపాడారు. శనివారం ఉదయం అతడు విశాఖ చేరుకుని అక్కడి నుంచి చనిపోవాలనే ఉద్దేశంతో రాజమహేంద్రవరం వచ్చాడు. సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ ఆధారంగా కిషోర్‌ను గుర్తించిన పోలీసులు… అతని భార్యతో ఫోన్‌లో మాట్లాడిస్తూ ఆదివారం ఉదయం 8.20గంటలకు పట్టుకున్నారు. ప్రస్తుతం రాజమహేంద్రవరం నుంచి తిరువూరుకు తీసుకొస్తున్నారు.

Missing – అసలు ఏం జరిగిందంటే ?

తనకు బదిలీ జరిగినా స్థానిక ఎమ్మెల్యే ఒత్తిడితో తమ శాఖ ఉన్నతాధికారులు రిలీవ్‌ చేయడంలేదని ఆరోపిస్తూ, ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ శుక్రవారం లేఖ రాసి తిరువూరు (Tiruvuru) మైనర్‌ ఇరిగేషన్‌ సెక్షన్‌ అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ కిషోర్‌ అదృశ్యమవడం (Missing) కలకలం రేపింది. ఆ లేఖ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు, అతని సెల్‌ఫోన్‌ను ట్రాక్‌ చేస్తే ఖమ్మం జిల్లా వీఎం బంజరులో సిగ్నల్‌ చివరిసారి ఆగినట్లు గుర్తించారు. ప్రత్యేక బృందాలతో రాత్రి పొద్దుపోయే వరకు ఆ పరిసర ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ దొరకలేదు. ఒకవైపు సీసీ కెమెరాల ఫుటేజీలు పరిశీలిస్తూ దర్యాప్తు కొనసాగిస్తూనే సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌పై పూర్తి నిఘా ఉంచారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం 7.02 గంటల సమయంలో కొన్ని నిమిషాల పాటు సెల్‌ఫోన్‌ ఆన్‌ చేసినట్లు పోలీసులు గుర్తించారు.

ఆ సమయంలో ఏఈఈ భార్య ఫోన్‌ మాట్లాడేందుకు ప్రయత్నించినా స్పందించలేదని తెలిసింది. అంతలోనే మళ్లీ ఫోన్‌ ఆగిపోయింది. దాంతో చివరిసారి సిగ్నల్‌ ఆధారంగా గాలించడానికి తిరువూరు ఎస్సై సత్యనారాయణ నేతృత్వంలోని పోలీసు బృందం, ఏఈఈ మామయ్య ఆనందరావులతో కలిసి బయలుదేరి సాయంత్రానికి విశాఖపట్నం చేరుకుని గాలించారు. ఏఈఈ శుక్రవారం తిరువూరు నుంచి బస్సులో బంజరు చేరుకుని, అక్కడి నుంచి రాజమహేంద్రవరంలో దిగి, ఏటీఎం నుంచి రూ.500 నగదు డ్రా చేయడాన్ని పోలీసులు గుర్తించారు. చివరికి రాజమహేంద్రవరంలో గోదావరి ఒడ్డున పోలీసులకు చిక్కాడు.

రిలీవ్‌ ఉత్తర్వులు జారీ

నెల రోజుల కిందట కంచికచర్ల డివిజన్‌ పరిధిలోని గౌరవరం సెక్షన్‌కు బదిలీ అయినా, అప్పటి నుంచి అధికారులు రిలీవ్‌ ఉత్తర్వులు ఇవ్వలేదు. అదృశ్యం నేపథ్యంలో ఈఎన్‌సీ ఆదేశాలతో వెంటనే రిలీవ్‌ చేస్తూ శనివారం డీఈఈ లిఖిత పూర్వక ఆదేశాలిచ్చారు. తిరువూరుకు సంబంధించిన బాధ్యతలు స్పెషల్‌ డివిజన్‌ అధికారులకు అప్పగించి, కంచికచర్ల డివిజన్‌లో బాధ్యతలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు.

Also Read : Mudragada Padmanabha Reddy: ముద్రగడ పద్మనాభరెడ్డికి అస్వస్థత ! కాకినాడ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స !

Leave A Reply

Your Email Id will not be published!