Pav Bhaji: రూ.2.15 కోట్ల నగలు కొట్టేసిన దొంగను ‘పావ్ భాజీ’ పట్టించింది
రూ.2.15 కోట్ల నగలు కొట్టేసిన దొంగను ‘పావ్ భాజీ’ పట్టించింది
Pav Bhaji : ఒక్కోసారి చిన్న చిన్న పొరపాట్లే… భారీ కుంభకోణాలను, దొంగతనాలను బయటపెడుతుంటాయి. కర్ణాటకలోని కలబురిగిలో సరిగ్గా ఇదే తరహా ఘటనే చోటు చేసుకుంది. పావ్‌భాజీ తినాలన్న కోరిక… దాదాపు రూ.2.15 కోట్ల దొంగతనాన్ని బయటపెట్టింది. జులై 11న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు తాజాగా వెల్లడించారు. కలబురిగిలోని మారాతుల్లా మాలిక్‌కు చెందిన బంగారు దుకాణంలో పట్టపగలే నలుగురు వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ప్రధాన సూత్రధారి ఫరూక్ అహ్మద్ మాలిక్ దుకాణం బయట గమనిస్తుండగా… మిగతా ముగ్గురూ మాస్కులు ధరించి లోపలికి వెళ్లి… యజమాని కాళ్లు, చేతులు కట్టేసి… తుపాకీతో బెదిరించి బలవంతంగా లాకర్ ఓపెన్ చేయించారు. డబ్బు, బంగారంతో అక్కడి నుంచి పరారయ్యారు.
Pav Bhaji – నగలు దొంగలను పట్టించిన పావ్ భాజీ
మారాతుల్లా మాలిక్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన కర్ణాటక (Karnataka) పోలీసులు, ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. దుకాణం ముందున్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా… లోపలి నుంచి వచ్చిన ముగ్గురు నిందితులు, బయట ఉన్న ఫరూక్ అహ్మద్ దగ్గరికి వచ్చి… ఏదో మాట్లాడారు. అక్కడి నుంచి నలుగురూ కలిసి వెళ్లిపోయారు. కొంత దూరం వెళ్లిన ఫరూక్ మళ్లీ వెనక్కి వచ్చి ప్లేట్ పావ్‌బాజీ (Pav Bhaji) తిన్నాడు. దుకాణదారుకు రూ.30 ఫోన్‌పే చేశాడు. అదే అతడిని పట్టించింది. ఆ లావాదేవీ ద్వారా ఫోన్ నెంబర్‌ను గుర్తించిన పోలీసులు… అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా.. దాదాపు 3 కిలోల బంగారం, కొంత నగదును దొంగిలించినట్లు అంగీకరించాడు. అయితే.. పోలీసులు మళ్లీ తన దుకాణంపైనే సోదాలు నిర్వహిస్తారేమోన్న భయంతో కేవలం 805 గ్రాముల బంగారం, కొంత నగదు పోయినట్లు మారాతుల్లా ఫిర్యాదు చేశారని పోలీసులు తెలిపారు. అతడిని కూడా విచారిస్తున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు ఫరూక్ అహ్మద్ కూడా ఓ బంగారు దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. అయితే, వ్యాపారంలో దాదాపు రూ.40 లక్షల వరకు నష్టపోయాడు. వాటి నుంచి బయటపడాలనే ఉద్దేశంతోనే… ఇతర నేరగాళ్లతో జట్టు కట్టి దోపిడీకి పన్నాగం పన్నినట్లు పోలీసులు భావిస్తున్నారు. దోపిడీ జరిగిన వెంటనే కొంత బంగారాన్ని కరిగించినట్లు తెలుస్తోంది. నిందితుడి నుంచి 2.865 కేజీల బంగారు ఆభరణాలు, రూ.4.80 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు. మిగతా నిందితుల కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు.
Also Read : MP Mithun Reddy: బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన మిథున్‌రెడ్డి
