Supreme Court: స్థానికత నిబంధనను 2028 నుంచి అమలు చేయండి – తెలంగాణకు సుప్రీం సూచన
స్థానికత నిబంధనను 2028 నుంచి అమలు చేయండి - తెలంగాణకు సుప్రీం సూచన
Supreme Court : ఎంబీబీఎస్‌లో స్థానిక కోటా కింద ప్రవేశాలు పొందాలనుకున్న విద్యార్థులు నీట్ రాయడానికి ముందు నాలుగేళ్లు వరుసగా తెలంగాణలో చదివి ఉండాలని జారీ చేసిన నిబంధనలను తప్పుబడుతూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ లో జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విక్రమ్చంద్రన్లతో కూడిన సుప్రీంకోర్టు (Supreme Court) ధర్మాసనం తీర్పు రిజర్వు చేసింది. మంగళవారం వాదనలను విన్న అనంతరం విచారణను ముగిస్తున్నట్లు ప్రకటించింది. ఇంకేమైనా వాదనలుంటే శుక్రవారంలోపు లిఖితపూర్వకంగా సమర్పించాలని ఆదేశించింది. స్థానికత సమస్యకు ప్రభుత్వమే పరిష్కార మార్గాలను చూపాలని, లేదంటే పిటిషన్ ను డిస్మిస్ చేస్తామని ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ గవాయ్ గత నెల 23న విచారణ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
Supreme Court of India Key Orders to Telangana
మంగళవారం జరిగిన విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది గోపాల్‌శంకర్ నారాయణన్ పరిష్కార మార్గాలు చెప్పకుండా తాము వాదనలు వినిపించాలనుకుంటున్నట్లు ధర్మాసనానికి చెప్పారు. దీనితో విచారణ ముగించి… ‘‘తెలంగాణ శాశ్వత నివాసులైన విద్యార్థులు ఇంటర్ పరీక్షలను తెలంగాణలో రాయకపోయినా ఎంబీబీఎస్ ప్రవేశాలకు అనుమతివ్వాలి’’ అని మధ్యంతర ఉత్తర్వులను జారీ చేయడానికి సీజేఐ సిద్ధమయ్యారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ… ధర్మాసనం అలాంటి ఉత్తర్వులు జారీ చేయడానికి ముందు తమ వాదనలు వినాలని అభ్యర్థించారు. అందుకు సీజేఐ అంగీకరించారు.
దీనితో సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. ‘‘ఒక్కో ఎంబీబీఎస్ సీటు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.కోటి ఖర్చుపెడుతోంది. ఆ ప్రయోజనాలను స్థానికంగా చదివిన పేద, మధ్యతరగతి విద్యార్థులకు కల్పించాలన్న ఉద్దేశంతోనే వరుసగా నాలుగేళ్లు రాష్ట్రంలో చదివి ఉండాలన్న నిబంధన తీసుకొచ్చింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 371డీని అనుసరించే ఈ నిబంధన తీసుకొచ్చాం. కర్ణాటక, అస్సాం, హరియాణాల్లోనూ ఇలాంటి నిబంధనలు ఉన్నాయి’’ అని అభిషేక్ సింఘ్వీ వివరించారు.
తెలంగాణ (Telangana) ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి హాజరై అంతర్రాష్ట్ర బదిలీలకు అవకాశం ఉండే అఖిల భారత సర్వీసు ఉద్యోగులు, న్యాయమూర్తులు, ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులు, సైనిక దళాలు, పారామిలిటరీ దళాల్లో పనిచేసేవారి పిల్లలకు ఈ నిబంధన నుంచి వెసులుబాటు కల్పిస్తామని హామీ పత్రాన్ని ధర్మాసనానికి సమర్పించారు.
విద్యార్థులను ముందే హెచ్చరించాలి: సీజేఐ
రాష్ట్ర ప్రభుత్వ వాదనలపై జస్టిస్ గవాయ్ పలు ప్రశ్నలు సంధించారు. ‘‘రాష్ట్రంలో పుట్టిన/పదో తరగతి వరకు చదివిన/తల్లిదండ్రులు ఇక్కడే శాశ్వత నివాసం ఉన్న విద్యార్థి వేరే రాష్ట్రాల్లో ఇంటర్ చదివారన్న కారణంతో ప్రవేశాలను నిరాకరించవచ్చా? జేఈఈ, నీట్ శిక్షణ నిమిత్తం రాజస్థాన్‌లోని కోటాకు దేశం నలుమూలల నుంచీ విద్యార్థులు వెళ్తుంటారు. అలా వెళ్లినవారి పరిస్థితి ఏంటి? ఉదాహరణకు తెలంగాణకు ఐఏఎస్ అధికారి డిప్యుటేషన్‌పై దిల్లీకొచ్చినప్పుడు ఆయన కుమారుడు దిల్లీలో ఇంటర్ చదివాడని పక్కన పెట్టేస్తారా? అకస్మాత్తుగా తెచ్చిన నిబంధన గురించి తెలియని విద్యార్థులు వేరే రాష్ట్రంలో చదువుకోవడానికి వెళితే అక్కడా, ఇక్కడా స్థానికులు కాకుండా పోయే ప్రమాదముంది.
ఇలాంటి నిబంధనతెలియక విద్యార్థులు ఇబ్బందిపడటాన్ని మేం అంగీకరించం. ఇలాంటి విషయాల్లో విద్యార్థులను ముందే హెచ్చరించాలి. తల్లిదండ్రులకు స్తోమత ఉన్నప్పుడు పిల్లలను మంచి చదువుల కోసం దుబాయ్, లండన్, అమెరికాకు పంపొచ్చు. వారంతా ఇక్కడివారే అయినా కేవలం రెండేళ్లు బయట చదివారన్న కారణంతో ఎలా కాదంటారు? అందువల్ల కావాలనుకుంటే 2028 నుంచి స్థానికత నిబంధనను అమల్లోకి తీసుకురండి’’ అని జస్టిస్ గవాయ్ సూచించారు.
Also Read : Satyapal Malik: మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ కన్నుమూత
