S-400 : ఆపరేషన్ సిందూర్ లో ఎస్-400 గగనతల రక్షణ వ్యవస్థ పాక్ వెన్నులో వణుకు పుట్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడు దాయాదికి కంటిమీద కునుకులేకుండా చేసే మరో విషయం బయటకు వచ్చింది. భారత్ అదనపు ఎస్-400 (S-400) వ్యవస్థల కొనుగోళ్లకు రష్యా తో చర్చలు జరుపుతున్నట్లు రక్షణ రంగ నిపుణులు చెప్పారని ఆ దేశ అధికారిక న్యూస్ టాస్ కథనం వెలువరించింది. ఇటీవల రష్యా మిలిటరీ టెక్నికల్ కోఆపరేషన్ అధిపతి షుగయేవ్ మాట్లాడుతూ భారత్ ఇప్పటికే ఎస్-400 (S-400)లను వాడుతోందని… కొత్త డెలివరీలపై చర్చలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
S-400 Updates
ఇటీవల రష్యా విదేశాంగ మంత్రి సెర్గీలవ్రోవ్ మాట్లాడుతూ మాస్కో నుంచి ఆయుధాలు కొనుగోలు చేయకూడదంటూ అమెరికా (USA) తెస్తున్న ఒత్తిడికి భారత్ ఏమాత్రం తలొగ్గదని తాము భావిస్తున్నట్లు చెప్పారు. ఈ విషయంలో తాము భారత్‌ను అభినందిస్తున్నామన్నారు. స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చి ఇన్స్టిట్యూట్ ప్రకారం 2020-24 మధ్యలో భారత్‌కు అత్యధికంగా 36శాతం ఆయుధాలు రష్యా నుంచే వచ్చాయి. ఆ తర్వాతి స్థానాల్లో ఫ్రాన్స్, ఇజ్రాయెల్, అమెరికా ఉన్నాయి.
రష్యా ఆయుధాలైన టీ-90 ట్యాంక్‌లు, సుఖోయ్-30 ఎంకేఐ భారత్‌లోనే లైసెన్స్డ్ ప్రొడక్షన్ చేస్తున్నారు. ఇక మాస్కో నుంచి మిగ్-29 ఫైటర్ జెట్లు, కమోవ్ హెలీకాప్టర్లు, ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ ఐఎన్ఎస్ విక్రమాదిత్యా (అడ్మిర్ గోర్ష్కోవ్) భారత్ అందుకొంది. ఇక ఏకే-203 రైఫిల్స్, బ్రహ్మోస్ క్షిపణులను భారత్‌లోనే తయారుచేస్తున్నారు.
ఇక ఆపరేషన్ సిందూర్ వేళ ఎస్-400 ప్రపంచరికార్డు సృష్టించింది. ఓ విమానాన్ని ఏకంగా 300 కిలోమీటర్ల అవతల నుంచే ధ్వంసం చేసినట్లు అధికారులు ప్రకటించారు. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా గతంలో ఎన్నడూ ఊపరితలంపై నుంచి గగనతల లక్ష్యాన్ని ఛేదించలేదు. అంతకుముందు కూల్చిన లక్ష్యాల్లో 200 కిలోమీటర్ల దూరమే అత్యధికం. ఎస్-400 గగనతల వ్యవస్థలో వాడే నాలుగు రకాల క్షిపణుల్లో 40ఎన్6 రేంజి 400 కిలోమీటర్లు. దీనిని ఆపరేషన్ సిందూర్‌లో వాయుసేన పూర్తిస్థాయిలో వాడుకొంది. ఈ వ్యవస్థకు భయపడి పాక్ తమ ఎఫ్-16 ఫైటర్జెట్లు, చైనా నుంచి కొనుగోలు చేసిన విమానాలను సుదూర ప్రదేశాలకు తరలించిందంటే అర్థం చేసుకోవచ్చు.
Also Read : Minister Nara Lokesh: కడప జిల్లాలో స్మార్ట్ కిచెన్ ప్రారంభించిన మంత్రి నారా లోకేశ్
