Revanth Reddy: కవిత వ్యవహారం పూర్తిగా ఆస్తి పంపకాల వివాదమే – సీఎం రేవంత్
కవిత వ్యవహారం పూర్తిగా ఆస్తి పంపకాల వివాదమే - సీఎం రేవంత్
Revanth Reddy : కవిత వ్యవహారం అంతా కుటుంబం, ఆస్తి పంపకాల వివాదమేనని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. దిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఈ సందర్భంగా ‘‘ఒక ఆడబిడ్డపై నలుగురు కలిసి దాడి చేస్తున్నారు. కుటుంబ వ్యవహారంతో సామాన్య ప్రజలకు ఏం సంబంధం ? కేసీఆర్ కుటుంబాన్ని ప్రజలు సామాజికంగా బహిష్కరించారు. 2014-19 మధ్య కేసీఆర్ కేబినెట్ లో ఒక్క మహిళ కూడా లేరు. ఉద్యమం పేరుతో ఆయన కొన్ని వందల మంది పిల్లల ఉసురు పోసుకున్నారు. అది ఊరికే పోదు. హైదరాబాద్ మెట్రో విషయంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy), కేటీఆర్ కలిసి అడ్డంకులు సృష్టిస్తున్నారు. ‘ఎల్ అండ్ టీ’తో ఒప్పందం చేసుకుంటేనే అనుమతులు ఇస్తామని కేంద్రం చెబుతోంది. కేంద్రంలో ఉన్న కిషన్‌రెడ్డి ఇలాంటి మెలికలు పెడుతున్నారు.
Revanth Reddy Key Comments on Kavitha Issue
కాళేశ్వరం అక్రమాలపై దర్యాప్తును సీబీఐకి ఇవ్వాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) పదే పదే డిమాండ్ చేశారు. అలా చేస్తే.. 48 గంటల్లోనే ఈ కేసు విచారణ చేపట్టేలా చూస్తానని అన్నారు. సీబీఐకి ఇచ్చి ఇన్ని రోజులైంది.. కిషన్‌రెడ్డి ఎక్కడా మాట్లాడటం లేదు. సీబీఐ దర్యాప్తును ఆపాలని కేటీఆర్ చెప్పారు కాబట్టే.. కిషన్‌రెడ్డి అమలు చేశారు. కేటీఆర్, కిషన్‌రెడ్డి మధ్య అంతటి అవినాభావ సంబంధం ఉంది’’ అని సీఎం అన్నారు.
పార్టీ ఫిరాయింపులపై నిర్దిష్ట నియమాలు ఏవీ స్పష్టంగా లేవని పేర్కొన్నారు. ‘‘ఎమ్మెల్యేలు పార్టీ మారిన అంశంపై భారత రాష్ట్ర సమితి నేతలకే స్పష్టత లేదు. ఆ పార్టీకి 37 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని అసెంబ్లీలో హరీశ్ రావు అన్నారు. 37 మంది కాదని కేటీఆర్ (KTR) ఇంకో సంఖ్య చెప్తున్నారు. ఇంటికొచ్చిన వాళ్లకు కండువా వేస్తే పార్టీ మారినట్లు అవుతుందా..?’’ అని సీఎం ప్రశ్నించారు.
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఈ సందర్భంగా సీఎం చెప్పారు. ‘‘బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించి మూడు బిల్లులు రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. రాష్ట్రపతి నిర్ణయం తీసుకునే గడువు అంశం సుప్రీంకోర్టులో ఉంది. దీనిపై సర్వోన్నత న్యాయస్థానం ఏం చెప్తుందో వేచి చూస్తున్నాం. న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. మళ్లీ కోర్టుకు వెళ్లాలా? వద్దా? అనేది అప్పుడే నిర్ణయం తీసుకుంటాం’’ అని సీఎం తెలిపారు.
ఎల్ అండ్ టీ ఎందుకు వివరణ ఇవ్వలేదు
ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణ పర్యటనకు వచ్చిన సందర్భంలో రీజనల్ రింగ్ రోడ్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని… ఇంతవరకూ ఎందుకు నెరవేర్చట్లేదని ప్రశ్నించారు. యూరియా కొరత కూడా రాజకీయ సృష్టే అని ఆరోపించారు. తెలంగాణలో హైడ్రా ఎందుకు తెచ్చామో రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసునని చెప్పుకొచ్చారు. కేసీఆర్, కేటీఆర్‌కి వ్యక్తిగత ప్రయోజనాలు ఉన్నాయని.. అందుకే హైడ్రాపై ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. హైదరాబాద్ మెట్రో బాధ్యత నుంచి ఎల్ అండ్ టీ తప్పుకుంటామని అంటోందని, అది కేసీఆర్ చేసిన తప్పిదమేనని విమర్శించారు. ఇప్పటివరకు ప్రభుత్వానికి ఎల్ అండ్ టీ సంస్థ ఎందుకు వివరణ ఇవ్వలేదని నిలదీశారు సీఎం రేవంత్‌రెడ్డి.
నా మాటలతో లోకేశ్‌కు ఎలాంటి సంబంధం లేదు
తాను ఒక సీఎంగా ఏపీ సీఎం చంద్రబాబును కలిశానని రేవంత్‌రెడ్డి అన్నారు. ‘‘చంద్రబాబును కలవడంలో ఎలాంటి దాపరికాలు లేవు. నేను అన్న మాటలతో లోకేశ్ కు ఎలాంటి సంబంధం లేదు. లోకేశ్‌ను చీకట్లో ఎందుకు కలిశారో కేటీఆర్ చెప్పాలి. లోకేశ్ తమ్ముడిలాంటి వాడని కేటీఆర్ (KTR) అంటున్నారు. తమ్ముడిలాంటి వాడైతే కష్ట కాలంలో అన్నలా ఎందుకు వ్యవహరించలేదు ? చంద్రబాబును జైల్లో పెడితే హైదరాబాద్ రోడ్లపైకి జనం వచ్చారు. ఆ జనాన్ని కేటీఆర్ ఎందుకు కొట్టించారు?’’ అని ప్రశ్నించారు.
మావోయిస్టులతో చర్చించాలి
హైదరాబాద్ మెట్రోలో ఐదు లక్షల మంది ప్రయాణం చేస్తున్నారని.. రానున్న ఐదేళ్లలో 15 లక్షల మంది ప్రయాణం చేసే విధంగా తాము ప్రణాళికలు రచిస్తున్నామని వివరించారు. అలాగే, పార్టీ నేతల కామెంట్లపై స్పందించారు సీఎం రేవంత్‌రెడ్డి. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువని ఉద్ఘాటించారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై సమగ్ర నివేదిక తయారు కావాల్సి ఉందని చెప్పుకొచ్చారు. కొందరూ నక్సలైట్లు జనజీవన స్రవంతిలో కలిశారని.. వారికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక పాలసీ ఉందని గుర్తుచేశారు. మావోయిస్టులను ఎన్‌కౌంటర్ చేయడంతో వారి సమస్య పరిష్కారం కాదని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారితో చర్చించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో ఎందుకు చర్చించడం లేదని ప్రశ్నించారు సీఎం రేవంత్‌రెడ్డి.
Also Read : CM Revanth Reddy: హైదరాబాద్-బెంగళూరు బుల్లెట్ రైలు ఇవ్వాలని కేంద్రాన్ని కోరాం -సీఎం రేవంత్
