Lorry Driver: లారీతో ఢీకొట్టి ఇద్దరిని హతమార్చిన డ్రైవర్
లారీతో ఢీకొట్టి ఇద్దరిని హతమార్చిన డ్రైవర్
శ్రీకాకుళం జిల్లా కంచిలిలో దారుణం చోటు చేసుకుంది. జలంత్ర కోట సమీపంలోని ఓ దాబా యజమానితో వాగ్వివాదానికి దిగిన లారీ డ్రైవర్… అదే లారీతో దాబా యజమానితో పాలు మరో వ్యక్తిని ఉద్దేశ పూర్వకంగా వారి మీదకి లారీ ఎక్కించి హత్యచేశాడు. వివరాల్లోకి వెళ్తే…
బిహార్‌కి చెందిన లారీ డ్రైవర్ భోజనం కోసం జలంత్ర కోట సమీపంలోని ఓ దాబా వద్ద ఆగాడు. అదే దాబాకు మరో వాహనంలో కొందరు వ్యక్తులు వచ్చారు. డ్రైవర్ కి వారికి చిన్నపాటి వాగ్వాదం తలెత్తింది. గొడవ అనంతరం తిన్నదానికి బిల్లు విషయంలో డ్రైవర్, దాబా యజమానికి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో డ్రైవర్ వెళ్లిపోయేందుకు లారీ ఎక్కగా… బిల్లు చెల్లించాలంటూ దాబా యజమాని వాహనానికి ఎదురుగా వచ్చాడు. దీనితో ఆగ్రహించిన లారీ డ్రైవర్ దాబా యజమాని అయూబ్ ను లారీతో తొక్కించాడు. దీనితో అయూబ్ అక్కడికక్కడే మృతి చెందాడు.
అదే సమయంలో దాబాకి పాలు ఇచ్చేందుకు వచ్చిన కంచిలి మండలానికి చెందిన డొక్కారి దండాసి ఈ ప్రమాదాన్ని చూసి ఆపేందుకు లారీ ముందుకు వెళ్లగా అతనిపై నుంచి కూడా లారీను ఎక్కించాడు. ఈ ఘటనలో దండాసి కాళ్లు విరిగి తీవ్ర రక్తస్రావం కావడంతో ప్రాణాలు కోల్పోయాడు. అయినప్పటికీ లారీ డ్రైవర్ అక్కడే ఉండకుండా వాహనంతోపాటు పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా… అక్కడ ఉన్నవారితోపాటు సమీప గ్రామస్థులు డ్రైవర్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కంచిలి ఎస్సై పారినాయుడు, సోంపేట సీఐ మంగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కేజీహెచ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో సీబీఐ సోదాలు
విశాఖ నగరంలోని కింగ్ జార్జ్ ఆస్పత్రి (కేజీహెచ్) సూపరింటెండెంట్ కార్యాలయంలో సీబీఐ సోదాలు చేపట్టింది. పశ్చిమ్‌బెంగాల్‌కు చెందిన విద్యార్థిని రీతూ ఆత్మహత్య వ్యవహారంలో జోక్యం చేసుకున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఇద్దరు అధికారులు తనిఖీలు చేపట్టారు. కేజీహెచ్ వైద్య వర్గాల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. 2023 జులై 14న రీతూ అనే విద్యార్థిని విశాఖలో ఆత్మహత్యకు పాల్పడింది. దీనిపై ఆమె కుటుంబసభ్యులు నాలుగో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యార్థిని మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ హైకోర్టును కూడా ఆశ్రయించారు. ఉన్నత న్యాయస్థానం ఆదేశాలతో సీబీఐ విచారణ చేపట్టింది.
