కంపెనీలు కార్య‌క‌లాపాలు జ‌రిపేలా చూడాలి

ఆదేశించిన సీఎం అనుముల రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ : పెట్టుబడులకు సంబంధించి వివిధ వేదికలపై తెలంగాణ ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్న కంపెనీలు, సంస్థలు తమ కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అందుకు అవసరమైన అన్ని రకాల సదుపాయాలను కల్పించాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి దావోస్, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ స‌మ్మిట్ లో ప‌లు కంపెనీల‌తో కుదిరిన అవ‌గాహ‌న ఒప్పందాలు కార్యరూపం దాల్చడంలో ఆయా సంస్థల కార్యకలాపాల పురోగతిపై ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమావేశం నిర్వ‌హించారు. మంత్రి శ్రీ‌ధ‌ర్ బాబుతో పాటు సీఎస్ రామ‌కృష్ణారావు , ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు.

పెట్టుబడులకు ఒప్పందం కుదుర్చుకున్న సంస్థలను మూడు కేటగిరీలుగా విభజించి పేరు ప్రఖ్యాతులున్న సంస్థలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు సీఎం. వివిధ రంగాలలో పెట్టుబడులకు సంబంధించి ఇప్పటి వరకు గ్రౌండ్ అయిన కంపెనీలు, పెండింగ్ వివరాలను అధికారులు సమావేశంలో వివరించారు. ఫ్యూచ‌ర్ సిటీతో పాటు వివిధ ప్రాంతాల్లో సంస్థలకు ప్రాధాన్యతల వారీగా కేటాయించాల్సిన భూ వివరాలను తెలిపారు. అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్న కంపెనీలకు వివిధ ప్రాంతాల్లో కేటాయించాల్సిన భూములకు సంబంధించి భూసేకరణ పెండింగ్ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అన్నారు సీఎం.

కంపెనీలకు కల్పించాల్సిన మౌలిక సదుపాయాలు, భవిష్యత్ అవసరాలకు సంబంధించి ప్రణాళికా బద్ధంగా ముందుకు వెళ్లాలని సూచించారు. డేటా సెంటర్లకు అవసరమైన నీటి కోసం ఎస్టీపీల ద్వారా శుద్ధి చేసిన నీటిని వినియోగించుకునేలా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు . ఫ్యూచ‌ర్ సిటీలో కార్యాల‌యం ప‌నులు త్వ‌ర‌గా పూర్తి చేసి అక్క‌డే ఎంవోయూల అమ‌లు, పురోగ‌తిపై నిరంత‌రం ప‌ర్య‌వేక్షించాల‌ని అన్నారు. ఏ ఏ ఎంవోయూలు ఎప్పుడు కుదుర్చుకున్నాం, అవి ఏ స్థితిలో ఉన్నాయి, అమ‌లుకు ఉన్న ఆటంకాలు, వాటి పెట్టుబ‌డులు, ఆ సంస్థలు క‌ల్పించే ఉద్యోగాల వంటి అన్ని వివరాలు సీఎంఓ, ఆయా శాఖ‌ల మంత్రులు తెలుసుకునేలా రియల్ టైమ్ అప్‌డేట్స్‌తో డ్యాష్ బోర్డు ఏర్పాటు చేయాల‌ని చెప్పారు.

Leave A Reply

Your Email Id will not be published!