చంచల్‌గూడ ఫ్లైఓవర్ ప్రారంభానికి సిద్దం

రూ. 620 కోట్ల‌తో నిర్మించిన రాష్ట్ర ప్ర‌భుత్వం

హైద‌రాబాద్ : హైద‌రాబాద్ న‌గ‌ర పాల‌క సంస్థ (జిహెచ్ఎంసీ ) ఆధ్వ‌ర్యంలో నిర్మించిన చంచ‌ల్ గూడ ఫ్లై ఓవ‌ర్ నిర్మాణం ప్రారంభానికి సిద్ద‌మైంది. నాలుగేళ్ల జాప్యం , అనేక గడువుల తర్వాత రూ. 620 కోట్ల వ్యయంతో నిర్మించిన 3.3 కి.మీ పొడవైన, నాలుగు లేన్ల చంచల్‌గూడ-సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ఆగస్టులో ప్రారంభం కానుంది. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే చంచల్‌గూడ, సైదాబాద్, మాదన్నపేట్ , ఐఎస్ సదన్ వంటి రద్దీగా ఉండే జంక్షన్ల వద్ద ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయని భావిస్తున్నారు. ఈ ఎలివేటెడ్ కారిడార్ చంచల్‌గూడ జైలు సమీపంలో ప్రారంభమై సంతోష్‌నగర్ వరకు విస్తరించి ఉంది. దీని ప్రధాన ర్యాంప్ చంచల్‌గూడ నుండి యాదగిరి థియేటర్ వరకు ఉంటుంది. ఇందులో సైదాబాద్ వద్ద ఒక ‘అప్-ర్యాంప్’ (ఎక్కే మార్గం) , ఐఎస్ సదన్ వద్ద ఒక ‘డౌన్-ర్యాంప్’ (దిగే మార్గం) కూడా ఉన్నాయి,

ఇవి రద్దీగా ఉండే ప్రాంతాల్లో రాకపోకలను సులభతరం చేస్తాయి. పాతబస్తీ ప్రాంతంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి ఈ ఫ్లైఓవర్ దోహద పడుతుందని చెబుతున్నారు. ఇది చంచల్‌గూడ సెంట్రల్ జైలు, ఒవైసీ ఆసుపత్రి సమీపం, పురానీ హవేలీ రోడ్డు మార్గం, అలీయాబాద్ వంటి ప్రాంతాలను కలుపుతూ సంతోష్‌నగర్ ఎక్స్-రోడ్స్ వద్ద ముగుస్తుంది. ప్రస్తుతం, చంచల్‌గూడ ప్రింటింగ్ ప్రెస్ నుండి ఐఎస్ సదన్‌కు వెళ్లే ప్రయాణికులు భారీ ట్రాఫిక్ కారణంగా పీక్ అవర్స్‌లో దాదాపు 30 నిమిషాల సమయం వెచ్చిస్తున్నారు. ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే, ప్రయాణ సమయం కేవలం ఎనిమిది నిమిషాలకు తగ్గుతుందని అంచనా. నిర్మాణ పనులు చాలా కాలం పాటు సాగడం వల్ల ఇరుకైన మార్గంలో ట్రాఫిక్ సమస్యలు మరింత తీవ్రమయ్యాయి, అందుకే స్థానికులు ఈ ప్రాజెక్ట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Leave A Reply

Your Email Id will not be published!