అమరావతి : స్థానిక సంస్థలు స్థానిక ప్రభుత్వాలుగా మారాలి. స్వయం ప్రతిపత్తి, స్వావలంబనతో ముందుకు సాగాలి . పల్లెలు జాతీయ సమగ్రత, సుస్థిరతకు మూల కేంద్రాలు కావాలి. ఇవీ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ బాధ్యతలు స్వీకరించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్దేశించుకున్న లక్ష్యాలు. గత ప్రభుత్వ విధానాలతో పూర్తిగా నిర్వీర్యం అయిన పంచాయతీరాజ్ వ్యవస్థకు పునరుజ్జీవం పోస్తూ, ప్రతి అడుగులో పారదర్శకతతో కూడిన పాలన, సరికొత్త సంస్కరణలు అమలు చేసిన పవన్ కళ్యాణ్ 22 నెలల కాలంలో ఆ దిశగా ఎన్నో అడుగులు ముందుకు వేశారు. గ్రామీణ పాలనలో జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపారు. ఈ జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన కూటమి ప్రభుత్వం గ్రామీణాభివృద్ధిలో ఒక చారిత్రాత్మక దశకు చేరువయ్యింది.
పవన్ కళ్యాణ్ దూరదృష్టితో కూడిన నాయకత్వంలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రతి అడుగులో అపూర్వ విజయాలు అందుకుంటోంది. రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ ర్యాంకింగ్స్ లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం 24వ స్థానం నుంచి నంబర్ వన్ స్థానానికి చేరుకుంది. రెండేళ్లలో సాధించిన అద్భుతం ఇది. పల్లెలే దేశాభివృద్ధికి పట్టుగొమ్మలన్న మహాత్ముడి గ్రామ స్వరాజ్య స్ఫూర్తితో మౌలిక సదుపాయాల కల్పన, పారదర్శకతతో కూడిన పాలన, గ్రామాల బలోపేతంపై దృష్టి సారిస్తూ విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చారు. 2024 ఆగస్టు 23వ తేదీన ఒకే రోజు 13,326 గ్రామాల్లో ఏకకాలంలో గ్రామ సభలు నిర్వహించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ వరల్డ్ రికార్డ్స్ యూనియన్ రికార్డు అందుకుంది. పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశాల ద్వారా రూ.4,500 కోట్ల ఉపాధి హామీ పనుల ప్రణాళికకు రూపకల్పన చేశారు. గ్రామీణ ప్రజల భాగస్వామ్యంతో పల్లెల అభివృద్ధి దశగా అడుగులు వేశారు.
