సింగపూర్ : ఏపీకి చెందిన మంత్రుల బృందం బిజీగా గడుపుతోంది సింగపూర్ పర్యటనలో. టూర్ లో భాగంగా ఇప్పటికే ఆ దేశం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, పాలనా పరంగా తీసుకుంటున్న చర్యల గురించి ఆరా తీశారు. మరో వైపు మంత్రులకు నిపుణులతో శిక్షణ ఇప్పించారు. ఇదిలా ఉండగా సింగపూర్ పర్యటనలో భాగంగా మంత్రుల బృందంతో కలిసి సింగపూర్ మాజీ మంత్రి మిస్టర్ లిమ్ స్వీ సే తో సమావేశమయ్యారు. సింగపూర్ ప్రగతిలో కీలకమైన “Nation-First to We First” పరిణామం గురించి చర్చించినట్లు చెప్పారు మంత్రి సత్యకుమార్ యాదవ్.
ప్రభుత్వం, ప్రజలు, ప్రైవేట్ రంగాలు (People, Public, Private sectors) సమన్వయంతో పనిచేస్తూ దేశాభివృద్ధిలో ఎలా భాగస్వామ్యం కావాలనే వ్యూహాలను పరిశీలించడం జరిగిందని అన్నారు. పారదర్శకత, జవాబుదారీతనంతో ప్రజల నమ్మకాన్ని పొందుతూ, దీర్ఘకాలిక అభివృద్ధిని ఎలా సాధించవచ్చనే అంశాలను అధ్యయనం చేసినట్లు తెలిపారు. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం సింగపూర్ అమలు చేస్తున్న గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ (Grievance Redressal Systems), నియోజకవర్గ స్థాయిలో ప్రజా ప్రతినిధుల బాధ్యతాయుత పనితీరుపై చర్చించామన్నారు సత్య కుమార్ యాదవ్. ప్రజల అవసరాలకు అనుగుణంగా తక్షణమే స్పందించే పటిష్టమైన యంత్రాంగాన్ని రూపొందించడంలో సింగపూర్ సాధించిన విజయాలను తెలుసుకున్నామన్నారు.
మన రాష్ట్రంలో కూడా ప్రజా పరిపాలనను మరింత పటిష్టం చేసేందుకు, ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించే దిశగా ఈ అధునాతన విధానాలను అమలు చేసే అవకాశాలపై దృష్టి సారించామన్నారు.
