ఏపీలో పెట్రోల్, డీజిల్ కొర‌త లేకుండా చూడాలి

స్ప‌ష్టం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు

అమ‌రావ‌తి : రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొర‌త అనేది లేకుండా చూడాల‌ని స్ప‌ష్టం చేశారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. సోమ‌వారం పెట్రోల్, డీజిల్ కొరతపై ముఖ్యమంత్రి టెలీకాన్ఫరెన్స్ నిర్వ‌హించారు. పౌర సరఫరాల శాఖామంత్రి నాదెండ్ల మనోహర్, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, సివిల్ సప్లై ఉన్నతాధికారులు, పెట్రోలియం కంపెనీల ప్రతినిధులు హాజ‌ర‌య్యారు . సమస్య పరిష్కారానికి నిన్న రాత్రి నుంచి ఇప్పటి వరకూ తీసుకున్న చర్యలపై వివరణ కోరారు సీఎం. ఈ రోజు సాయంత్రానికి మెజారిటీ ప్రాంతాల్లో సాధారణ స్థితి ఏర్పడుతుందని ముఖ్యమంత్రికి వివరించారు అధికారులు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులు. పెట్రోల్, డీజిల్ సరఫరాలో సాధారణ పరిస్థితిని తెచ్చేందుకు అధికారులు, ఆయిల్ కంపెనీల యాజమాన్యాలు సమన్వయంతో పని చేయాలని సీఎం ఆదేశించారు. ఉదయం డిస్పాచ్ సెంటర్ల నుంచి వెళ్లిన ఆయిల్ ట్యాంకర్లు ఈ రోజు సాయంత్రం వరకూ రిటైల్ బంకులకు చేరుకుంటాయని తెలిపారు.

స్వయంగా కలెక్టర్లు, ఎస్పీల పర్యవేక్షణలో ప్రజలు ఇబ్బంది పడకుండా ఆయిల్ సరఫరా జరిగేలా చూడాలని స్ప‌ష్టం చేశారు సీఎం. కలెక్టర్లు, ఉన్నతాధికారులు ఆయిల్ డిస్పాచ్ సెంటర్లకు వెళ్లాల‌ని సూచించారు. ఆయా జిల్లాల్లో పరిస్థితులపై ఆర్టీజీ సెంటర్ ద్వారా నిరంతరం పర్యవేక్షించి ప్రతీ 3 గంటలకు ఒకసారి నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులు, మంత్రులకు చంద్ర‌బాబు ఆదేశించారు.
మీడియా, సోషల్ మీడియాలో వస్తోన్న కథనాలు, క్షేత్రస్థాయి సమాచారం ఆధారంగా అధికారులు స్పందించాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.ఆయిల్ డిపోల నుంచి రిటైల్ బంకులకు ఎటువంటి జాప్యం లేకుండా ఆయిల్ ట్యాంకర్లు చేరుకునే విధంగా చూడాల‌న్నారు. బ్లాక్ మార్కెట్‌, కృత్రిమ కొరత సృష్టించేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Leave A Reply

Your Email Id will not be published!