అమరావతి : ఏపీని వడగాల్పులు వెంటాడుతున్నాయి. రాష్ట్రంలో పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో 45.9 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డైనట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. మొత్తం 28 జిల్లాలకు గాను 20 జిల్లాల పరిధిలోని 252 మండలాల్లో ఎండ తీవ్ర ప్రభావం చూపిందని, 41 డిగ్రీలకు పైగా నమోదైనట్లు వెల్లడించారు. శనివారం అధిక ఉష్ణోగ్రతలతో పాటు విజయనగరం 8, మన్యం 10, పోలవరం 2, ఎన్టీఆర్ 1, గుంటూరు 1, పల్నాడు 19, మార్కాపురం 6, ప్రకాశం 10, నెల్లూరు 3, తిరుపతి 4 మొత్తంగా 64 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు. ఎండ తీవ్రత, ఉక్కపోత పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
పల్నాడు(జి) పిడుగురాళ్లలో 45.9°C, నెల్లూరు(జి) గూడూరులో 45.5°C, కృష్ణా(జి) పెద్దపారుపూడి, ఎన్టీఆర్(జి) తొర్రగుడిపాడు 45.1°C, ప్రకాశం(జి) అద్దంకిలో 44.6°C, ఏలూరు(జి) అల్లిపల్లి, మార్కాపురం(జి) పెద్దచేర్లోపల్లిలో 44.5°C, తిరుపతి(జి) వెంకటగిరిలో 44.4°C, గుంటూరు(జి) చేబ్రోలు 44.1°C, బాపట్ల(జి) కారంచేడులో 44°C, నంద్యాల(జి) సంజామల, వైఎస్సార్ కడప (జి) కోడూరులో 43.2°C, పోలవరం(జి) కూనవరంలో 42.6°C, చిత్తూరు(జి) తవణంపల్లె, విశాఖ(జి) ములగాడలో 42.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు పేర్కొన్నారు.
మరోవైపు దక్షిణ ఒడిశా నుండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ద్రోణి కొనసాగుతుందని ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి ,పోలవరం, విశాఖ, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఆది, సోమవారాల్లో కొన్ని జిల్లాల్లో ఎండతీవ్రత స్వల్పంగా తగ్గి మేఘావృత వాతావరణం మరియు ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు పొలాల్లో పని చేసే రైతులు, కూలీలు, పశు కాపరులు చెట్ల కింద నిలబడరాదని హెచ్చరించారు.
