జూన్ 2న ఇందిరమ్మ ఇళ్ల రెండో దశ ప్రారంభం

సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి

హైద‌రాబాద్ : రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. జూన్ 2న ఇందిర‌మ‌మ్ ఇళ్ల రెండో ద‌శ ప్రారంభిస్తామ‌న్నారు. పేదల జీవనోపాధి కష్టాలను నివారించేందుకు, క్యూర్ (CURE) పరిధిలో 5 నుంచి 8 కిలోమీటర్ల పరిధిలో ఇందిరమ్మ ఇళ్లను నిర్మించనున్నామ‌ని తెలిపారు. నియోజకవర్గాన్ని యూనిట్‌గా పరిగణించి భూమిని గుర్తించడం చేస్తామ‌న్నారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపునకు ప్రత్యేక డ్రైవ్ చేప‌డతామ‌ని చెప్పారు. ఈ నెలాఖరులోగా హైదరాబాద్‌లో ఇంటి స్థలాలు ఉన్న అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇంటి మంజూరు పత్రాలు అంద‌జేస్తామ‌ని వెల్ల‌డించారు పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి. ప్రభుత్వ భూమిలో అంగుళం కూడా ఆక్రమణను సహించబోమని హెచ్చ‌రించారు.

ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు సంబంధించి ఇళ్ల నిర్మాణం, పురోగ‌తిపై స‌మీక్ష చేప‌ట్టారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రాష్ట్రంలోని పేదల సొంత ఇంటి కలను నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మక ఇందిరమ్మ గృహ పథకాన్ని నిబద్ధతతో అమలు చేస్తోందని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణపు మొదటి దశ పూర్తి కావస్తున్న తరుణంలో, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ పథకం రెండో దశను రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న ఆదిలాబాద్‌లో లాంఛనంగా ప్రారంభించనున్నట్లు మంత్రి ప్రకటించారు. మే 21న జరగనున్న మంత్రివర్గ సమావేశంలో ఈ కార్యక్రమానికి సంబంధించిన విధి విధానాలపై చర్చించి ఖరారు చేస్తామని ఆయన తెలిపారు.

రెవెన్యూ, గృహ నిర్మాణ విషయాలపై ప్రజాప్రతినిధులతో జిల్లా వారీగా నిర్వహిస్తున్న సమీక్షా సమావేశాలలో భాగంగా, ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు చెందిన ఇన్‌చార్జి మంత్రులు, జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లు, గృహ నిర్మాణ, రెవెన్యూ, అటవీ శాఖల అధికారులతో మంత్రి హౌసింగ్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి అసెంబ్లీ స్పీకర్ గద్దం ప్రసాద్ కుమార్, రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి మహమ్మద్ అజారుద్దీన్, శాసన మండలి చీఫ్ విప్ పి. మహేందర్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.

Leave A Reply

Your Email Id will not be published!