తిరుమల : మానసిక ప్రశాంతత, శారీరక దృఢత్వం, ఆరోగ్యకర జీవనశైలికి యోగాభ్యాసం ఎంతో ఉపయుక్తమని టీటీడీ ఈవో ఎం. రవిచంద్ర అన్నారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించనున్న కార్యక్రమాలపై తిరుమల శ్రీ పద్మావతి అతిథి భవనంలోని సుదర్మ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుత జూన్ 7 నుండి 21వ తేదీ వరకు ప్రతిరోజూ టీటీడీ ఆధ్వర్యంలో యోగా అవగాహన, ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. యోగాభ్యాసం ఒత్తిడి, ఆందోళనలను తగ్గించడంతో పాటు వ్యక్తిత్వ వికాసానికి దోహద పడుతుందని తెలిపారు. అన్ని వయస్సుల వారిలో ఆరోగ్యకర జీవన విధానాన్ని అలవర్చేందుకు యోగా ఉత్తమ సాధనమని పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ఈషా ఫౌండేషన్, పతంజలి యోగపీఠం, రామచంద్ర మిషన్, బ్రహ్మకుమారీస్, టీటీడీ ఎస్వీ ఆయుర్వేద ఆసుపత్రి సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
జూన్ 7 నుండి 21 వరకు టీటీడీ ఉద్యోగులు, మహిళా ఉద్యోగులు, విద్యార్థులు, యువత, వృద్ధులు, ఆసుపత్రుల్లోని రోగులకు ప్రత్యేక యోగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. యోగా దినోత్సవానికే పరిమితం కాకుండా ఈ కార్యక్రమాన్ని నిరంతర ప్రక్రియగా కొనసాగించేలా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. విద్యార్థుల్లో చిన్న వయస్సు నుంచే యోగాపై ఆసక్తి, అవగాహన పెంపొందేలా విద్యాసంస్థల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.జూన్ 21న ఉదయం 6 గంటలకు తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలోని పరేడ్ గ్రౌండ్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమం అనంతరం వేలాది మంది పాల్గొనే యోగా అవగాహన ర్యాలీ నిర్వహించాలని సూచించారు.
ఈ సమావేశంలో అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి, జేఈవో (విద్య, ఆరోగ్యం) డా. శరత్, సీవీఎస్‌వో మురళీకృష్ణ, సీఈ సత్యనారాయణ, డీఎఫ్‌వో ఫణికుమార్ నాయుడు, సంక్షేమ విభాగం డిప్యూటీ ఈవో ఆనందరాజు తదితర అధికారులు పాల్గొన్నారు.
