బీసీ హాస్టళ్లు, గురుకులాలకు గ్రేడింగ్ : ఎస్. స‌విత‌

గ్రేడింగ్ ఆధారంగా బదిలీలు, పదోన్నతులకు ప్రాధాన్యం

అమరావతి : ఆరోపణలకు తావివ్వకుండా రాష్ట్రంలో బీసీ హాస్టళ్లు, గురుకులాలను పకడ్బందీగా నిర్వహించాలని, పనితీరు ఆధారంగా వాటికి గ్రేడింగ్ లు ఇవ్వనున్నామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత , జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత స్ప‌ష్టం చేశారు. గ్రేడింగ్ ఆధారంగా భవిష్యత్తులో చేపట్టబోయే బదిలీలు, పదోన్నత్తుల్లో ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు వెల్లడించారు. బీసీ హాస్టళ్లు, గురుకులాల్లో పారిశుధ్య నిర్వహణ చేప‌ట్టాల‌న్నారు. దీనిలో భాగంగా త్వరలో 1,291 పోస్టులు భర్తీ చేయనున్నామని తెలిపారు. కొత్తగా 142 మంది కుక్, కమాటీలను నియమించనున్నామని, సచివాలయాల నుంచి 224 మంది వీఆర్వోలను, మహిళా పోలీసులను డిప్యూటేషన్ ప్రభుత్వం హాస్టళ్లకు కేటాయించిందని తెలిపారు. ఈ నెల 12 నుంచి ప్రారంభం కాబోయే నూతన విద్యా సంవత్సరం సందర్భంగా హాస్టళ్లను, గురుకులాలను సిద్ధం చేయాలని, పరిసరాలను, మరుగుదొడ్లను, తాగునీటి ట్యాంకులను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు.

అమరావతిలోని రాష్ట్ర సచివాలయం నుంచి అన్ని జిల్లాలకు చెందిన హాస్టల్ వార్డెన్లు, ఎంజేపీ స్కూళ్ల ప్రిన్సిపాల్లు, ఏబీసీడబ్ల్యూవోలు, డీబీసీడబ్ల్యూవోలతో మంత్రి సవిత వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 12 నుంచి నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో బీసీ హాస్టళ్లను, ఎంజేపీ గురుకులాలను సిద్ధం చేయాలని ఆదేశించారు. ఎలుకలు, బొద్దింకలు, ఇతర కీటకాలు రాకుండా హాస్టళ్లు, గురుకులాల పరిసరాలతో పాటు తరగతి గదులు, విశ్రాంతి గదులు, మరుగుదొడ్లను, బాత్ రూమ్ లను శుభ్రం చేయాలన్నారు. దోమలు చొరబడకుండా ఉండేలా తరగతి, విశ్రాంతి గదుల ద్వారాలకు, కిటికీలకు దోమ తెరలు తక్షణమే అమర్చాలన్నారు. ఆర్వో ప్లాంట్ల ఏర్పాటుతో పాటు నూతన మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తిచేసి, అందుబాటులోకి తీసుకు రావాలని మంత్రి సవిత ఆదేశించారు.

Leave A Reply

Your Email Id will not be published!