అమరావతి : ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్బంగా శిక్షణ పొందుతున్న క్లస్టర్ ఇంచార్జ్ లతో కాఫీ కబుర్లు సమావేశంలో పాల్గొన్నారు. కార్యకర్తలను నాయకులుగా మలిచేందుకే శిక్షణ ఇస్తున్నామని స్పష్టం చేశారు. ప్రజలకు మంచి చేయాలని, నాయకులుగా ఎదగాలనే సంకల్పం తీసుకోవాలని సీఎం సూచించారు. డీఎస్సీ నిర్వహణపై చేస్తున్న దుష్ప్రచారానికి గట్టిగా ఇచ్చిన కౌంటర్లతో గొడ్డలి పార్టీ కంగుతిన్నదని ఎద్దేవా చేశారు. సర్వేలు చేయిస్తున్నాం అని , ఎవరైనా తప్పులు చేస్తే , వాళ్లను వదిలించు కుంటానని తేల్చి చెప్పారు టీడీపీ అధినేత.
కార్యకర్తలందరూ సీక్రెట్ అనే పుస్తకాన్ని చదవాలని సూచించారు నారా చంద్రబాబు నాయుడు. సంకల్పం తీసుకుని పని చేస్తే… ఆ సంకల్పం నెరవేరడానికి కావాల్సిన ఎకో సిస్టం ఆటోమేటిగ్గా ఏర్పడుతుందని చెప్పారు. మంచి ఆలోచనలు చేసే వాళ్ల చుట్టూ మంచి వాళ్లే తోడవుతారు. చెడు ఆలోచనలు చేసే వాళ్ల చుట్టూ గొడ్డలి బ్యాచ్ జమ అవుతుందన్నారు. ఇకపై పార్టీకి ఓటమి లేదు… రాదు. ఆ స్థాయిలో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు సీఎం. ప్రజలతో మంచిగా ఉంటున్నాం, ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తున్నాం, సంక్షేమం-అభివృద్ధి చేస్తున్నాం, ప్రజలకు స్వేచ్ఛను ఇచ్చాం, ముఖ్యంగా ఆత్మ విమర్శ చేసుకుంటున్నాం. అందుకే ఓటమి రాదన్నారు.
.
పార్టీ పదవులు మొదలుకుని టిక్కెట్ల కేటాయింపుల వరకు నిరంతరం సర్వేలు చేస్తున్నాం అన్నారు.
ప్రజలు, కార్యకర్తల అభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నాం. రాష్ట్ర, పార్టీ శ్రేయస్సు కోసం తప్పులు చేసిన వాళ్లని, తేడాగా ఉన్నవాళ్లని వదిలించుకుంటామన్నారు. ఎన్నికల్లో కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ఏం ప్రచారం చేశారో… అవన్నీ ప్రభుత్వం చేస్తోందన్నారు సీఎం. ప్రభుత్వం చేస్తోన్న మంచిని గడప గడపకు వెళ్లి చెప్పాలి. ఆనాడు చెప్పిన వాటిని ఈనాడు నెరవేరుస్తున్నామనే విషయాన్ని ప్రజలకు గుర్తు చేయాలని అన్నారు.
