అమరావతి : రాజ్యసభ సభ్యుడిగా జనసేన అభ్యర్థిగా శనివారం లింగమనేని రమేష్ తన నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తనపై నమ్మకంతో రాజ్యసభ అభ్యర్థిగా అవకాశం కల్పించిన జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు హృదయ పూర్వకంగా కృతజ్ఞతలు తెలియ చేస్తున్నట్లు తెలిపారు. నా అభ్యర్థిత్వాన్ని బలపరిచిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియ చేస్తున్నట్లు చెప్పారు లింగమనేని రమేష్. రాజ్యసభ వేదికగా రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని ప్రకటించారు.
జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, శాసనమండలి సభ్యులు నాగబాబు మాట్లాడుతూ జనసేన పార్టీ తరఫున లింగమనేని రమేశ్ రాజ్యసభకు వెళ్లడం తమకు ఎంతో ఆనందాన్ని ఇస్తోందని అన్నారు. ఆయన సరైన వ్యక్తి. ఈ ఎంపిక పట్ల జనసేన పార్టీ శ్రేణులంతా ఎంతో సంతోషంగా ఉన్నాయని అన్నారు. నామినేషన్ సమయంలో కూటమికి చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారు. పారిశ్రామికవేత్తగా గుర్తింపు పొందారు లింగమనేని రమేష్. ఆయన స్వస్థలం విజయవాడ. పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ తో సన్నిహిత సంబంధం ఉంది. ఆయన రియల్ ఎస్టేట్ రంగంలో భారీ స్థాయిలో కార్యకలాపాలు చేపట్టడమే కాకుండా, LEPL గ్రూప్ ద్వారా విద్య , వైద్య రంగాలలో అనేక సామాజిక అభివృద్ధి , సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. రమేష్ 2015 నుండి జనసేన పార్టీతో, దాని అధ్యక్షుడితో అనుబంధం కలిగి ఉన్నారు.
