మీడియా అక్రెడిటేషన్ల జీఓపై హైకోర్టు షాక్

ప్రభుత్వ సంజాయిషీ కోరిన కోర్టు

హైదరాబాద్ : రాష్ట్ర, జిల్లా మీడియా అక్రెడిటేషన్ కమిటీ లకు సంబంధించిన జీవో ఆర్టీ 229 పై దాఖలైన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. రాష్ట్ర, జిల్లా మీడియా అక్రెడిటేషన్ కమిటీలలో నాలుగు జర్నలిస్టు యూనియన్ లకు బదులు కేవలం మూడు యూనియన్ లకే ప్రాతినిధ్యం ఇచ్చి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ కు ప్రాతినిధ్యం ఇవ్వకుండా జీవో 229 ని అమలు చేయడాన్ని సవాల్ చేస్తూ పిటిష‌న్ దాఖ‌లైంది. ఈ జీవోను రద్దు చేయాలని ఏవీఎన్ టీవీ కరస్పాండెంట్ నంబి పర్వతాలు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ విచారణకు వచ్చింది.

కేసు స్వీకరించిన జస్టీస్ అపరేష్ కుమార్, జస్టీస్ మొహినుద్దీన్ లతో కూడిన డివిజన్ బెంచ్ విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపు న్యాయవాది, ప్రభుత్వ తరపు న్యాయవాదుల మధ్య వాదలు జరిగాయి. మీడియా అక్రెడిటేషన్ కార్డుల జారీ కోసం ఏర్పాటైన జీవో 252 నిబంధనల ప్రకారం అక్రెడిటేషన్ కమిటీలో నాలుగు యూనియన్ లను తీసుకోవాల్సి ఉండగా,అట్టి నిబంధనలను తుంగలో తొక్కి కేవలం మూడు యూనియన్ లతోనే కమిటీ ఏర్పాటు చేసి అక్రెడిటేషన్ కార్డులు జారీ చేయడం రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ తరపు న్యాయవాది రఘు వాదనలు వినిపించారు. జీవో 229 ని రద్దు చేయాలని కోర్టును కోరారు.

ఈ వాదనలు విన్న జస్టీస్ అపరేష్ కుమార్, జస్టీస్ మొహినుద్దీన్ష్ లు ప్రభుత్వ తరపు ప్రత్యేక న్యాయవాదిని సంజాయిషీ అడిగారు. ఈ రిట్ పిటిషన్ కు సంబంధించిన ఫైల్ తనకు అందలేదని ప్రభుత్వ తరపు న్యాయవాది వాదించగా, పిటిషన్ కాపీలు జీపీకి ఇవ్వకుండా కోర్టులో కేసు నెంబర్ నమోదు కావడం అసాధ్యమని పిటిషనర్ న్యాయవాది వాదించారు.

Leave A Reply

Your Email Id will not be published!