కల్పవృక్ష వాహనంపై శ్రీ సౌమ్యనాథ స్వామి దర్శనం
వార్షిక బ్రహ్మోత్సవాలకు తరలి వచ్చిన భక్త బాంధవులు
తిరుపతి : నందలూరులోని శ్రీ సౌమ్యనాథ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఇక ఉత్సవాలలో భాగంగా నాలుగో రోజైన శనివారం ఉదయం శ్రీ సౌమ్యనాథ స్వామివారు దివ్యమైన కల్పవృక్ష వాహనంపై విహరిస్తూ భక్తులకు అనుగ్రహం ప్రసాదించారు. గోవింద నామ స్మరణ, చెక్కభజనలు, కోలాటాలు, మంగళ వాయిద్యాల నడుమ సాగిన వాహన సేవ భక్తి పారవశ్యాన్ని నింపింది. అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పించి స్వామివారి దివ్య మంగళదర్శనం పొందారు.
పురాణాల ప్రకారం కల్పవృక్షం కోరుకున్న కోర్కెలన్నింటినీ నెరవేర్చే దివ్య వృక్షంగా ప్రసిద్ధి చెందింది. ఆ కల్పవృక్ష వాహనంపై విహరించిన శ్రీ సౌమ్యనాథ స్వామివారు భక్తులందరికీ సకల ఐశ్వర్యాలు, శుభ ఫలితాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆశీర్వదిస్తున్నారనే భావనతో భక్తులు విశేష భక్తి శ్రద్ధలతో వాహనసేవలో పాల్గొన్నారు. జూలై 26న ఉదయం శేష వాహనంపై, రాత్రి బ్రహ్మోత్సవాల్లో అత్యంత వైభవంగా నిర్వహించే గరుడ వాహనంపై శ్రీ సౌమ్యనాథ స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.
ఈ వాహనసేవలో ఆలయ ఏఈవో రవి, సూపరింటెండెంట్ హనుమంతయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్ దిలీప్, ఆలయ అర్చకులు, అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
