న్యూఢిల్లీ : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వ ప్రతిభ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. న్యూఢిల్లీలో జరిగిన ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. మోదీ 12 సంవత్సరాల పాలన, దేశ చరిత్రలో అత్యంత సుదీర్ఘ కాలం పాటు ప్రధానిగా సేవలు అందించడంపై చంద్రబాబు ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపారు . ప్రధానమంత్రి నాయకత్వ ప్రతిభ, పరిపాలనా సామర్ధ్యం, ప్రపంచ స్థాయిలో దేశానికి తెచ్చిన పేరు ప్రఖ్యాతలపై చంద్రబాబు ప్రసంశలు కురిపించారు. దేశాభివృద్ధికి నిరంతరం శ్రమిస్తూనే రాష్ట్రాల అభ్యున్నతికి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మద్దతుగా నిలిచినందుకు సీఎం ధన్యవాదాలు తెలిపారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతా తీర్మానాన్ని గౌరవ సభలో ప్రవేశ పెట్టడం తాను గౌరవంగా భావిస్తున్నాని సీఎం చంద్రబాబు ప్రకటించారు. సరైన సమయంలో, సరైన స్థానంలో, సరైన నాయకుడిగా దేశానికి ప్రధానిగా మోదీ ఉన్నారని చెప్పారు. ఒకవైపు దేశానికి స్థిరత్వాన్ని ఇచ్చే మార్గదర్శిగా, మరోవైపు కొత్త ఆలోచనలకు, నవ కల్పనలకు ప్రేరణనిచ్చే నాయకుడిగా పని చేయడం మోదీ గొప్పతనం అన్నారు. మోదీ ఎప్పుడూ ‘నేషన్ ఫస్ట్’ అనే అజెండాతో పని చేస్తారని ప్రశంసించారు. 2001లో ముఖ్యమంత్రిగా ఎన్నికైన నాటి నుంచి నేటి ప్రధాని పదవి వరకు 25 ఏళ్లుగా మోదీ ప్రజా జీవితంలో విశేషంగా సేవలు అందించారని ప్రశంసించారు.
ప్రజల అంచనాలకు తగ్గట్టుగా నిలబడటం మోదీ నాయకత్వానికి ఉన్న ప్రత్యేకత అని పేర్కొన్నారు.నేడు ప్రపంచం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. యుద్ధాలు, సరఫరా వ్యవస్థల అంతరాయాలు, ఇంధన మార్కెట్ల అస్థిరత, ప్రధాన ఆర్థిక వ్యవస్థల మందగమనం, నెలకొన్న అనిశ్చితి ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్నాయని అన్నారు. అయినప్పటికీ మోదీ సమర్ధవంతమైన పాలనతో భారతదేశంలో ద్రవ్యోల్బణం సుమారు 3.5 శాతం వద్దే కొనసాగుతోందని చెప్పారు. ముఖ్యమంత్రిగా విజయవంతమైన పాలన అందించిన మోదీ, ప్రధానమంత్రిగా కూడా అదే స్ఫూర్తి, సృజనాత్మకత, నూతనత్వాన్ని అనుసరించడం విశేషం అని అన్నారు.