రూ.లక్ష కోట్లతో మిషన్ రాయలసీమ ప్రాజెక్టు

చేప‌ట్ట‌నున్న‌ట్లు ప్ర‌క‌టించిన నారా లోకేష్

తిరుపతి: రాయలసీమను రాయల్ సీమగా మార్చడమే ఎన్డీయే లక్ష్యం అని స్ప‌ష్టం చేశారు మంత్రి నారా లోకేష్. లక్షకోట్లతో చేపట్టబోయే మిషన్ రాయలసీమ ప్రాజెక్టు దేశానికే ఆదర్శం కాబోతోందని ప్ర‌క‌టించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తిరుపతిలో నిర్వహించిన విజయోత్సవ సభకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో కలిసి లోకేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… రాయల్ ఎన్ ఫీల్డ్, క్యారియర్, ఎల్ జీ, రిలయన్స్ సీమకే వచ్చాయని అన్నారు. ఇది రాయలసీమపై మాకు ఉన్న నిబద్ధత. టీడీపీ, జనసేన, బీజేపీ మనది పెద్ద కుటుంబం. రాష్ట్రం కోసం, ప్రజల కోసం అందరూ కలిసి పనిచేయాలి. ఇగోలు వద్దు, ఏదైనా సమస్య ఉంటే మాట్లాడుకుని పరిష్కరించు కోవాలని పిలుపునిచ్చారు. కూటమి ధర్మాన్ని అందరూ పాటించాలి. అహంకారం వద్దు…అహంకారం వల్లే వాళ్లకి 151 – 11 అయ్యాయి. ప్రజల్లోకి చేసిన, చేస్తున్న మంచి పనులు చెబుతామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.

కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రజాప్రభుత్వం రెండేళ్ళు పూర్తి చేసుకుందని అన్నారు నారా లోకేష్‌. ప్రజా ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రజలకు ప్రశాంతత వచ్చింది. దాడులు లేవు, జేసీబీలు, కబ్జాలు, హత్యలు, బెదిరింపులు, బూతులు కూడా లేవు. రాష్ట్రంలో ఉన్నది ఒక్కటే ప్రశాంతత. ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది…ప్రశాంతంగా ఉన్నారు. తిరుపతి వచ్చిన తరువాత నాకు ఒక విషయం గుర్తొచ్చింది. ప్రతిపక్షంలో ఉన్నపుడు ఇదే చంద్రగిరి గడ్డపై నేను ఒక మాట చెప్పాను. వెంకన్న చాలా పవర్ ఫుల్…అయనతో పెట్టుకోవద్దు… మాడి మసై పోతావు అని జగన్ కి చెప్పాను. ఆయనకి అర్దం కాలేదు..డైరెక్ట్ గా స్వామితోనే పెట్టుకున్నారు. 2024లో ఏం జరిగిందో మీరంతా చూశారు. విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావుకి సీమ అంటే ప్రేమ. రాయలసీమకు కరువు వస్తే జోలె పట్టి ప్రజలను ఆదుకుంది ఎన్టీఆర్. తెలుగు గంగ, గాలేరు – నగరి ప్రాజెక్ట్స్ రూపకల్పన చేసింది ఎన్టీఆర్. రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్, శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ, ₹50 హార్స్ పవర్ విద్యుత్, తిరుమలలో నిత్య అన్నదానం ప్రారంభించింది ఎన్టీఆర్ అన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!