హైదరాబాద్ : పల్స్ పోలియో కార్యక్రమంలో తెలంగాణ 100 శాతానికి పైగా కవరేజీ నమోదు చేయడం విశేషం. అధికారిక అంచనాల ప్రకారం రాష్ట్రంలో 0-5 ఏళ్ల వయస్సు గల పిల్లలు సుమారు 4,097,749 మంది ఉన్నారు. అయితే, ఈ కార్యక్రమం సమయంలో మొత్తం 4,153,185 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయడం ద్వారా అంచనాలను మించిన ఫలితాలు నమోదయ్యాయి. ఆరోగ్య శాఖ తన లక్ష్యాన్ని అధిగమించి 101.4 శాతం కవరేజీని సాధించడంతో రాష్ట్రవ్యాప్త పల్స్ పోలియో టీకా కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. అధికారిక అంచనాల ప్రకారం, రాష్ట్రంలో 0-5 ఏళ్ల వయస్సు గల పిల్లలు సుమారు 4,097,749 మంది ఉన్నారు. పోలియో బూత్‌లు , ఇంటింటికీ వెళ్లి నిర్వహించిన విస్తృత పర్యటనల ద్వారా, మొదట టీకా వేయించుకోని పిల్లలను గుర్తించి వారికి టీకా వేయడం సాధ్యమైందని ఆరోగ్య శాఖ వెల్లడించింది.
టీకా కార్యక్రమానికి ఏ ఒక్క బిడ్డ కూడా దూరంగా ఉండ కూడదనే ఉద్దేశంతో నిర్మాణ ప్రాంతాలు, వలస కార్మికుల నివాసాలు, అధిక ముప్పు ఉన్న ప్రాంతాలు, మురికివాడలు , పిల్లల సంరక్షణ కేంద్రాలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో అంకితభావంతో కృషి చేసిన వైద్యులు, అధికారులు, ఏఎన్‌ఎంలు . ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది, వాలంటీర్లు , ఇతర క్షేత్రస్థాయి సిబ్బందిని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అభినందించారు. తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించడం ద్వారా చురుకుగా పాల్గొన్న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తల్లిదండ్రులను కూడా ప్రత్యేకంగా ప్రశంసించారు. రాష్ట్రాన్ని పోలియో రహితంగా ఉంచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రతి బిడ్డ ఆరోగ్యాన్ని కాపాడేందుకు నిరంతరం అప్రమత్తంగా ఉంటామని మంత్రి పునరుద్ఘాటించారు. ప్రజల సహకారం , ఆరోగ్య శాఖ సిబ్బంది అవిశ్రాంత కృషి వల్లే ఈ కార్యక్రమం విజయవంతమైందని ఆయన పేర్కొన్నారు.
