అమరావతి : గతంలో కొలువు తీరిన మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రారన్ని సర్వ నాశనం చేశాడని సంచలన ఆరోపణలు చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. నంద్యాల జిల్ల బేతంచెర్ల మండలం గుటుపల్లెలో గత పాలకులు 22ఏ జాబితాలో పెట్టిన భూములకు విముక్తి కల్పించడం జరిగిందన్నారు. భూముల వివాదం పరిష్కరించేందుకు స్వయంగా బనగానపల్లి తహసిల్దార్ కార్యాలయానికి వెళ్లారు. సీఎం సమక్షంలో ఈ భూములకు శాశ్వత పరిష్కారం లభించిందన్నారు. బేతంచర్ల మండలం గుటుపల్లిలో 215 సర్వే నెంబర్ లో ఉన్న 2,669 ఎకరాల రైతుల భూమిని 22ఏ కింద గత పాలకులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేశారని, నిషేధిత జాబితాలో చేర్చారంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వీసు ఇనాం భూముల రిజిస్ట్రేషన్ చట్టం 1908 కింద ఆ భూముల్ని 22ఏ జాబితాలో చేర్చటంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
వీటితో పాటు 426 ఎకరాల వక్ఫ్ భూములను కూడా 2023లో నిషేధిత జాబితాలో చేర్చినట్టు ప్రభుత్వం గుర్తించిందన్నారు నారా చంద్రబాబు నాయుడు.ఈ ఏడాది మార్చిలో తమ సమస్య పరిష్కరించాలంటూ ముఖ్యమంత్రికి వినతిపత్రం ఇచ్చారు బేతంచర్ల రైతులు . వారి గోడు విని 2,074 ఎకరాల పట్టాభూమిని 22ఏ 1 సీ జాబితా నుంచి తొలగించాలంటూ తమ సర్కార్ తీర్మానం చేసిందన్నారు. ఈ అంశంపై బనగానపల్లె తహసిల్దార్ కార్యాలయంలో ఐజీఆర్ఎస్ వెబ్ సైట్ నుంచి 2074 ఎకరాలను 22ఏ నుంచి తొలగించేలా సీఎం ఆదేశాలు అప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేశారు. సీఎం చంద్రబాబు సమక్షంలో అధికారిక ప్రక్రియ చేపట్టింది రెవెన్యూ శాఖ. 22ఏ జాబితా నుంచి వక్ఫ్ భూములను తొలగించటంతో 897 మంది రైతులకు లబ్ది చేకూరింది.
