మంత్రులు జిల్లాల్లో విస్తృత పర్యటనలు చేపట్టాలి
దిశా నిర్దేశం చేసిన ముఖ్యమంత్రి డీకే శివకుమార్
బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ దూకుడు పెంచారు. కొత్తగా కొలువు తీరింది కేబినెట్. పలువురు యువ, అనుభవం కలిగిన నేతలకు హైకమాండ్ ప్రయారిటీ ఇచ్చింది. ఈ సందర్భంగా జరిగిన కీలక సమావేశంలో దిశా నిర్దేశం చేశారు సీఎం. మంత్రులు తప్పనిసరిగా ఇక నుంచి జిల్లాల్లో విస్తృతంగా పర్యటించాలని ఆదేశించారు. తమకు కేటాయించిన జిల్లాల్లో పర్యటించి అధిక వర్షపాతం., కరువు ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి, నివేదికలు సమర్పించాలని స్పష్టం చేశారు. కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు కొత్త మంత్రులు బుధవారం నుండి తమకు కేటాయించిన జిల్లాల్లో పర్యటించాలని అన్నారు. కరువు వల్ల ప్రభావితమైన ప్రాంతాలను పరిశీలించి, ఆ తర్వాత రెవెన్యూ శాఖ మంత్రికి నివేదికలు సమర్పించాలని పేర్కొన్నరాఉ. కేబినెట్ సమావేశంలో ముందున్న సవాళ్లు,భవిష్యత్తులో తలెత్తే అవకాశం ఉన్న సమస్యల గురించి చర్చించడం జరిగిందన్నారు.
కావేరీ బేసిన్ ప్రాంతంలో కరువు , నీటి సమస్యల గురించి కూడా చర్చలు జరిగాయి. వర్షాల వల్ల ప్రస్తుతానికి సమస్యలు తాత్కాలికంగా తగ్గినప్పటికీ, ఒక తీవ్రమైన సంక్షోభం ముంచుకొచ్చే పరిస్థితి ఉండేది. దేవుని దయ వల్ల ప్రస్తుతానికి ఆ సమస్య పరిష్కారమైందని పేర్కొన్నారు. తమిళనాడుకు 3,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని ఆదేశాలు ఉన్నప్పటికీ తాము 30,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశామన్నారు సీఎం. ఇప్పటికే బెళగావి, చిత్రదుర్గ, కలబురిగి డివిజన్లలో సమావేశాలు నిర్వహించాను, త్వరలోనే మైసూరు డివిజన్ సమావేశం కూడా జరుగుతుందన్నారు. అందరి సలహాలను తీసుకున్నామని, తాగునీటి అవసరాల కోసం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 1 కోటి రూపాయల నిధులను కేటాయించడం జరిగిందన్నారు.
