అమరావతి : తెలుగుజాతి గర్వించేలా అమరావతి నిర్మాణాన్ని సీఎం చంద్రబాబు చేపట్టారని మంత్రి సవిత తెలిపారు. సచివాలయం, హెచ్ ఓడీ టవర్లతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నివాసాలు అద్భుతం నిర్మిస్తున్నారన్నారు. ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నివాసాలు పూర్తయ్యాయని, ఈ నెల 15 తేదీన జీఏడీకి అప్పగించనున్నారని తెలిపారు. 2028 నాటికి సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ తదితర ఐకానిక్ భవనాల నిర్మాణాలను పూర్తి చేయబోతున్నామన్నారు. రాజధాని పనుల్లో ముఖ్యమైన రోడ్ల నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయన్నారు. ప్రజలకు అన్ని సేవలు ఒకేచోట లభించేలా సచివాలయం, హెచ్ ఓడీ కార్యాలయాలను నిర్మిస్తున్నామన్నారు ఎస్. సవిత . గతంలో హైటెక్ సిటీ సైబరాబాద్ ను నిర్మించిన సీఎం చంద్రబాబు నాయుడు అమరావతిని కూడా పూర్తి చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి పోతారని మంత్రి సవిత కొనియాడారు.
ప్రపంచం మెచ్చేలా గ్రీన్ ఫీల్డ్ రాజధానిని సీఎం చంద్రబాబు నిర్మిస్తుండడం చూసి జగన్ ఓర్వలేక పోతున్నారని మంత్రి మండిపడ్డారు. జగన్ ది విధ్వంసం క్రెడిట్ అని , తమ ప్రభుత్వానికి అభివృద్ధి క్రెడిట్ అని అన్నారు. రప్పా రప్పా నరకడం, విధ్వంసం, దోపిడీ, అరాచకం ఇవి జగన్ క్రెడిట్ అని అన్నారు. ఆ క్రెడిట్ ను ఎవ్వరూ ఆశించరన్నారు. ప్రజలు ఛీ కొట్టడంతో ఇప్పుడు మావిగన్ అంటూ మరో డ్రామా ఆడుతున్నారన్నారు. మావిగన్ ఎక్కడుందో కూడా తెలియని అజ్ఞాని జగన్ అని విమర్శించారు. నిరసనల పేరుతో రాష్ట్రంలో జగన్, వైసీపీ నాయకులు విధ్వంసం సృష్టిస్తున్నారని మంత్రి సవిత మండిపడ్డారు. జగన్ రెడ్డిని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు.
