అమరావతి : ఏపీ తీసుకున్న రుణాలపై వడ్డీ శాతం తగ్గించేలా రీ-షెడ్యూల్ చేశామని పేర్కొంది ఏపీ ప్రభుత్వం. మొత్తంగా ఉన్న అప్పుల్లో 370 లోన్లకు సంబంధించి రూ. 1.50 లక్షల కోట్ల అప్పులపై వడ్డీలు తగ్గించేలా బ్యాంకర్లతో చర్చలు జరిపామన్నారు సీఎం చంద్రబాబు .13 శాతంగా ఉన్న అప్పులపై వడ్డీలను 10.90 శాతానికి తగ్గించడం జరిగిందని పేర్కొన్నారు. మరికొన్ని అప్పులపై 9.9 శాతం వడ్డీ ఉండగా వాటిని 9.1 శాతానికి తగ్గించినట్లు తెలిపారు. ఇంకొన్ని అప్పులపై 8 శాతం వడ్డీ ఉండగా.. వాటిని 7.7 శాతానికి తగ్గించారని, దీంతో ఏటా రూ. 1100 కోట్లు ఆదా అవుతోందని, మొత్తంగా రూ. 8269 కోట్ల మేర ఆదా అయిందన్నారు.
సూపర్ సిక్స్‌తో పాటు ఇతర సంక్షేమ కార్యక్రమాల ద్వారా హామీల అమలు చేస్తున్నామన్నారు చంద్రబాబు నాయుడు. గత రెండేళ్లలో సంక్షేమంపై రూ.1,49,401 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. ఎన్టీఆర్ భరోసా కింద రూ.68,296 కోట్లు, విద్యుత్ సబ్సిడీ కింద రూ.32,800 కోట్లు, తల్లికి వందనం కింద రూ.20,210 కోట్లు , అన్నదాత సుఖీభవ కింద రూ.8,724 కోట్లు, ఎన్టీఆర్ వైద్య సేవ కింద రూ.5,921 కోట్లు, బియ్యం సబ్సిడీ కింద రూ.4,322 కోట్లు, దీపం 2.0 కింద రూ.3,724 కోట్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద రూ.1,529 కోట్లు, స్త్రీశక్తి కింద రూ.1,520 కోట్లు, ధరల స్థిరీకరణ నిధి కింద రూ.1,200 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు సీఎం.
అంతే కాకుండా మత్స్యకార సేవలో పథకం కింద రూ.505 కోట్లు, ఆటో డ్రైవర్ల సేవలో కింద రూ.436 కోట్లుఇమామ్‌లు, మౌజిన్‌ల గౌరవ వేతనాలు కింద రూ.134 కోట్లు, పాస్టర్ల గౌరవ వేతనాల కింద రూ.80 కోట్లు, ఇప్పటి వరకు పీ4 కింద 11 లక్షల కుటుంబాలను దత్తత, 2.4 లక్షల కుటుంబాలకు సాయం అందుతోందన్నారు. 30,607 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. మెగా DSC–2025 ద్వారా 15,941 ఉపాధ్యాయ పోస్టులు నింపామన్నారు. 5,757 కానిస్టేబుల్ పోస్టులు పూర్తి చేశామన్నారు.
