తమ్మిడికుంటను ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలి

చెరువుల అభివృద్ధిని పరిశీలించిన హైడ్రా కమిషనర్

హైద‌రాబాద్ : చెరువుల అభివృద్ధి పనులను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. స్థానిక ఎమ్మెల్యేలు అరికపూడి గాంధీ , మాధవరం కృష్ణారావు తో పాటు పలు పార్టీలకు చెందిన నాయకులు కూడా ఈ పర్యటనలో ఉన్నారు. కూకట్పల్లిలోని ఐడీఎల్ చెరువు అభివృద్ధిని సమీక్షించారు. వచ్చే గణేష్ నిమజ్జనోత్సవానికి ఐడీఎల్ చెరువులో ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే కృష్ణారావు సూచించారు. చెరువు అభివృద్ధి పనులు జరుగుతున్న దృష్ట్యా నిమజ్జనానికి వెసులుబాటు క‌ల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఏడాదికి తాత్కాలిక ఏర్పాట్లు చేస్తామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఈ సంద‌ర్భంగా హామీ ఇచ్చారు. వచ్చే ఏడాది నాటికి పూర్తి స్థాయిలో చెరువు అభివృద్ధి చేస్తామన్నారు. గణేష్ నిమజ్జనానికి కూడా చక్కటి ఏర్పాట్లు చేస్తామన్నారు. భవిష్యత్తులో పెరిగే గణేష్ విగ్రహాల సంఖ్యకు అనుగుణంగా ఏర్పాట్లు ఉంటాయ‌న్నారు క‌మిష‌న‌ర్.

ప్రధాన రహదారి పక్కన మినీ పాండ్ ను ఆకర్షణీయంగా నిమజ్జనానికి తీర్చి దిద్దుతామ‌న్నారు. చెరువులో దాదాపు 3 మీటర్ల మేర పూడికను తీసి చెరువులో నీటి సామ‌ర్థ్యం పెంచుతామ‌ని చెప్పారు. అనంత‌రం మాధాపూర్‌లోని త‌మ్మిడికుంట చెరువును ఎమ్మెల్యే అరిక‌పూడి గాంధీతో క‌లిసి ప‌రిశీలించారు. చెరువును ప్రారంభోత్స‌వానికి సిద్ధం చేయాల‌ని సూచించారు. చెరువుకు ఇరువైపులా ఏర్పాటు చేస్తున్న ప్ర‌ధాన గేట్ల‌ను ప‌రిశీలించారు. కొండాపూర్, మాధాపూర్ ఐటీ కారిడార్ నుంచి పెద్ద‌మొత్తంలో వ‌చ్చే వ‌ర‌ద నీరు చెరువుకు చేరుతుండ‌డంతో వ‌ర‌ద ముప్పు త‌ప్పింద‌ని అన్నారు. అలాగే చెరువు నిండిన త‌ర్వాత నీరు బ‌య‌ట‌కు వెళ్ల‌డం, నిలువ‌కు వెసులుబాటుగా ఔట్‌లెట్ల‌ను అభివృద్ధి చేయాల‌ని సూచించారు. చెరువు చుట్టూ ప‌చ్చిక బైళ్లు, ప్లే ఏరియాలు అభివృద్ధి చేసి ఆహ్లాద‌క‌ర‌మైన వాతావ‌ర‌ణం ఏర్ప‌డేలా చూడాల‌న్నారు. హైడ్రా అడిష‌న‌ల్ క‌మిష‌న‌ర్ డి. ఆనంద్‌, ఏసీపీ పి. తిరుమ‌లతో పాటు.. ఇరిగేష‌న్, మున్సిప‌ల్ అధికారులు ఈ ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!