అమరావతి : మారుతున్న కాలానికి అనుగుణంగా నేరాల రూపం కూడా మారి పోయిందని, దీనికి అనుగుణంగానే పోలీసింగ్ మారాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నేరాల నియంత్రణలో తక్షణం ఆధారాలు కోల్పోకుండా చూడాలని పోలీసు అధికారులకు దిశా నిర్దేశం చేశారు. నేర నియంత్రణలో గోల్డెన్ అవర్ అత్యంత కీలకమని ఆయన అన్నారు. రాష్ట్ర సచివాలయం నుంచి డీజీపీ నుంచి క్షేత్రస్థాయిలోని స్టేషన్ హౌస్ ఆఫీసర్లతో సీఎం సమావేశం నిర్వహించారు. డీజీపీ సహా రేంజ్ ఐజీలు, డీఐజీలు, డీఎస్పీలు, స్టేషన్ హౌస్ ఆఫీసర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడారు. ఏపీ పోలీసుల కీర్తి దేశమంతా మార్మోగాలని దానికి అనుగుణంగా సిద్ధం కావాలని అన్నారు. నేరాల దర్యాప్తులో టెక్నాలజీ ఇంటిగ్రేషన్ పెరగాలని సూచించారు.
దీనిపై ముఖ్యమంత్రి మాట్లాడుతూ డీజీపీ నుంచి ఎస్హెచ్ఓ వరకూ సమావేశం నిర్వహించటం ఇదే తొలిసారి అన్నారు. శాంతిభద్రతల విషయంలో లోటు పాట్లను సవరించుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ప్రజలు ప్రశాంతంగా ఉండాలన్నా, రాష్ట్రానికి పెట్టుబడులు రావాలన్నా శాంతిభద్రతలు ముఖ్యం అని స్పష్టం చేశారు సీఎం. రాష్ట్ర ప్రభుత్వానికి పోలీసు విభాగం ఓ ప్రైడ్. ప్రజల విశ్వాసాన్ని చూరగొనేలా అంతా వ్యవహరించాలి. ఇన్విజిబుల్ పోలీసు, విజిబుల్ పోలీసింగ్ విధానం అమలు చేయాలని ఆదేశించారు డీజీపీని. గడచిన రెండేళ్లుగా కాగ్నిజబుల్ క్రైమ్స్ 14 శాతం మేర తగ్గాయన్నారు. ఇదంతా సమర్థవంతమైన ప్రభుత్వం ఉండడం వల్లనే సాధ్యమైందన్నారు. కాలానుగుణంగా నేరాలు కూడా మారుతున్నాయని, వాటిని ఓ కంట కనిపెట్టి చర్యలు తీసుకోవాలన్నారు సీఎం. డిజిటల్ క్రైమ్, డిజిటల్ అరెస్టులు తదితర నేరాలు కొత్త సవాళ్లుగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి అనుగుణంగా సాంకేతికతను పోలీసులు అంది పుచ్చుకోవాలని పిలుపునిచ్చారు.