ఉద్దేశ పూర్వకంగా చెల్లింపులు ఎగవేస్తే చర్యలు తప్పవు
తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన సీఎం ఎ. రేవంత్ రెడ్డి
హైదరాబాద్ : సీఎం ఎ. రేవంత్ రెడ్డి మిల్లర్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మిల్లర్లు చెల్లించాల్సిన ధాన్యం విలువకు సంబంధించిన మొత్తం సొమ్మును వసూలు చేయాలని ఆదేశించారు. వ్యాపార దృక్పథంతో మిల్లులు నడిపే వారి పట్ల సానుకూల వైఖరిని అవలంబిస్తామని, అయితే ఉద్దేశ పూర్వకంగా చెల్లింపులు ఎగవేసే వారి పట్ల మాత్రం కఠినంగా వ్యవహరిస్తామని ఆయన హెచ్చరించారు. ముఖ్యమంత్రి, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తో కలిసి పౌరసరఫరాల శాఖపై సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వం వేల కోట్ల రూపాయల బకాయిలు పేరుకు పోయేలా చేసి, ఇప్పుడు ఆ తప్పును ప్రస్తుత ప్రభుత్వంపై నెట్టడానికి ప్రయత్నించడం పట్ల ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
బకాయిల వసూలులో ఇప్పటి వరకు కొంత పురోగతి సాధించినప్పటికీ, చివరి గింజ వరకు బకాయి మొత్తాన్ని రాబట్టాలని సీఎం నొక్కి చెప్పారు. బకాయిల వసూలుకు సంబంధించి వివిధ వ్యూహాలను రూపొందించాలని ఆదేశించారు. ఈ వ్యూహాల రూపకల్పన పూర్తయిన తర్వాత, ఆ నివేదికను క్యాబినెట్ ఉప-సంఘానికి సమర్పించాలని సూచించారు. ఉప-సంఘం సమీక్ష తర్వాత ప్రభుత్వం తగిన నిర్ణయాలు తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. మొండిగా బకాయిలు చెల్లించని మిల్లర్లకు కేటాయించే ధాన్యాన్ని మహిళా సంఘాలకు మళ్లిస్తామని, మిల్లింగ్ బాధ్యతలను కూడా ఆ మహిళా సంఘాలకే అప్పగిస్తామని ఆయన ప్రకటించారు.
ప్రతి సీజన్‌లో ధాన్యం నిల్వలో ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, ఇప్పటి నుండే తగిన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. భారీగా ధాన్యం వచ్చే నల్గొండ, సూర్యాపేట, నిజామాబాద్, పెద్దపల్లి , కామారెడ్డి జిల్లాల్లో ‘సైలో బ్యాగుల’ ఏర్పాటుకు పైలట్ ప్రాజెక్టును చేపట్టాలన్నారు సీఎం. స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో సైలో బ్యాగుల నిర్మాణానికి ప్రతి నియోజకవర్గంలో 50 నుండి 100 ఎకరాల భూమిని కేటాయిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. వీటి నిర్మాణానికి సంబంధించి రెవెన్యూ, పౌరసరఫరాలు, మహిళా సంక్షేమ శాఖ మంత్రులతో సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు.