విద్యార్థుల ఆందోళ‌న‌ను అర్థం చేసుకోండి

సీఎం హేమంత్ సోరేన్ కు రాహుల్ గాంధీ లేఖ

న్యూఢిల్లీ : జార్ఖండ్ లో నిరసన చేస్తున్న విద్యార్థులకు మద్దతుగా సీఎం హేమంత్ సోరెన్ కు లోక్ స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నేత‌, అమేథీ ఎంపీ రాహుల్ గాంధీ లేఖ రాశారు. భారత రాజ్యాంగం కల్పించిన శాంతియుత నిరసన హక్కు మన ప్రజాస్వామ్యానికి అత్యంత కీలకమైన పునాదుల్లో ఒకటి అని పేర్కొన్నారు. గత కొన్ని నెలలుగా పేపర్ లీకులు, విద్యా వ్యవస్థలోని అవకతవకలకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు అందిస్తోందని తెలిపారు. భారత విద్యా వ్యవస్థను ఆర్ఎస్ఎస్, బీజేపీ తమ ఆధీనంలోకి తీసుకుని విద్యార్థులపై దోపిడీ, అణచివేతకు సాధనంగా మార్చాయని కాంగ్రెస్ పార్టీ విశ్వసిస్తోంద‌ని స్ప‌ష్టం చేశారు. దశాబ్దం క్రితం ఉన్న బలమైన జ్ఞాన వ్యవస్థ ఇప్పుడు ఇక కొనసాగడం లేదని రాహుల్ గాంధీ లేఖలో పేర్కొన్నారు.

జార్ఖండ్‌లో కూడా రాష్ట్ర నియామక పరీక్షల్లో జరుగుతున్న అవకతవకలకు వ్యతిరేకంగా విద్యార్థులు నిరసనలు చేస్తున్నారని, వారి ఆందోళన శాంతియుతమైనదే కాకుండా, వారు చేస్తున్న డిమాండ్లు న్యాయమైనవి అని తెలిపారు. ముఖ్యమత్రి ఏర్పాటు చేసిన కమిటీ ద్వారా జార్ఖండ్ ప్రభుత్వం విద్యార్థులతో చర్చలు ప్రారంభించడం అభినందనీయమని, విద్యార్థులు లేవనెత్తిన పలు డిమాండ్లపై ఇప్పటికే ఏకాభిప్రాయం ఉన్నట్లు తాను భావిస్తున్నానని అన్నారు రాహుల్ గాంధీ. అయితే నిరసనలు కొనసాగుతున్నాయని, కొంతమంది విద్యార్థులు నిరవధిక నిరాహార దీక్షలో ఉన్నారని లేఖలో ప్రస్తావించారు.

నిరసన చేస్తున్న విద్యార్థుల ప్రతినిధులతో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ స్వయంగా సమావేశమై వారి సమస్యలను వినాలని రాహుల్ గాంధీ సూచించారు. ఇలా స్వయంగా వారితో మాట్లాడటం ద్వారా విద్యార్థుల మిగిలిన సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందనే నమ్మకాన్ని మరింత బలపరచవచ్చని పేర్కొన్నారు. భారత యువతే దేశ భవిష్యత్తు. ఈ సంక్షోభ సమయంలో వారికి సంఘీభావం, మద్దతు అందించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. విద్యార్థుల సమస్యలను పూర్తిగా విని, ఈ సమస్యకు పరిష్కారం చూపేందుకు తగిన చర్యలు తీసుకోవాలని రాహుల్ గాంధీ జార్ఖండ్ ముఖ్యమంత్రిని కోరారు.

Leave A Reply

Your Email Id will not be published!