చెన్నై : మహాబలిపురం వేదికగా జరిగిన దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశంలో ముల్లపెరియార్ ఆనకట్ట అంశాన్ని లేవనెత్తారు కేరళ సీఎం వీడీ సతీశన్. చెంగల్పట్టు జిల్లాలోని మహాబలిపురంలో జరిగిన 31వ దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశం సందర్భంగా కేరళ ముఖ్యమంత్రి వి.డి. సతీశన్ తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్‌తో పరస్పరం పలకరించుకున్నారు. ఈ సందర్భంగా ముల్ల పెరియార్ ఆనకట్ట సమస్యను ప్రస్తావించారు. అలాగే ఆరోగ్యం, మౌలిక సదుపాయాలు, పర్యావరణ పరిరక్షణ ప్రాంతీయ భద్రత వంటి అంశాలలో సహకార సమాఖ్య విధానం అవసరమని ఆయన నొక్కి చెప్పారు. కొత్త ముల్లపెరియార్ ఆనకట్ట నుండి తమిళనాడుకు దక్కాల్సిన పూర్తి నీటి వాటాను అందించడానికి కేరళ సిద్ధంగా ఉందని సతీశన్ తెలిపారు. కొత్త ఆనకట్ట రూపకల్పన, స్థలం ఎంపిక , నిర్మాణ బాధ్యతలను తమిళనాడు చూసుకుంటుందని, దీనికి అయ్యే పూర్తి ఖర్చును కేరళ భరిస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఆనకట్ట ఎల్లప్పుడూ సురక్షితంగానే ఉందని తమిళనాడు వాదిస్తుండగా, అది సురక్షితం కాదని, నీటి మట్టం పెరిగి ఆనకట్ట తెగితే దిగువ ప్రాంతాల్లోని ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని కేరళ ప్రభుత్వం పేర్కొంది. దానిని నిలిపి వేయాలని కోరింది. సతీశన్ లేవనెత్తిన ఇతర అంశాలలో తన ప్రభుత్వానికి చెందిన ‘మిషన్ సముద్ర’ ప్రాజెక్ట్, గనులు , ఖనిజాల చట్టానికి చేసిన ఇటీవలి సవరణలను ఉపసంహరించు కోవాల్సిన అవసరం, అలాగే పార్లమెంటు సభ్యుల సంఖ్యను పెంచకుండానే మహిళలకు మూడింట ఒక వంతు రిజర్వేషన్ కల్పించడం వంటివి ఉన్నాయి. ఆరోగ్య సంరక్షణ నిధులు, మౌలిక సదుపాయాలు, పర్యావరణ పరిరక్షణ , ప్రాంతీయ భద్రత వంటి అంశాలలో సహకార సమాఖ్య విధానాన్ని పాటించాలని కోరారు సతీషన్.
