ప్రభుత్వ భూముల ఈ- వేలంలో రూ. 1,386 కోట్ల ఆదాయం
రాయదుర్గంలో ఎకరాకు రూ. 264 కోట్ల భారీ ధర పలికింది
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన భూముల వేలం పాటలో అత్యధికంగా ధరకు అమ్ముడు పోయాయి స్థలాలు. ఎకరాకు రూ. 264 కోట్ల భారీ ధరకు అమ్ముడు పోయింది ప్లాట్ P1 . ఇది హైదరాబాద్ చరిత్రలోనే అత్యధికం కావడం విశేషం. తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ రాయదుర్గంలోని ప్లాట్ నంబర్ P1 కోసం నిర్వహించిన ఈ-వేలం ద్వారా అద్భుతమైన ఫలితాలను సాధించింది. 5.25 ఎకరాల అత్యంత విలువైన, బహుళ-ప్రయోజన భూమి ద్వారా రూ. 1,386 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ ఫలితం భారతదేశంలోని అత్యంత చురుకైన రియల్ ఎస్టేట్ మార్కెట్లలో ఒకటిగా హైదరాబాద్ ఎదుగుదలను చాటిచెప్పడమే కాకుండా, మౌలిక సదుపాయాల ఆధారిత అభివృద్ధి దిశగా తెలంగాణ అనుసరిస్తున్న వ్యూహాత్మక విధానాన్ని ధృవీకరిస్తోంది. ప్లాట్ నంబర్ P1 (5.25 ఎకరాలు) కోసం ఎకరాకు రూ. 175 కోట్ల కనీస ధర నిర్ణయించగా వేలంలో ఎకరాకు రూ. 264 కోట్ల తుది ధర పలికింది.
ఇది కనీస ధర కంటే 50.9% అధికం. ప్రముఖ డెవలపర్ల మధ్య పెరుగుతున్న పోటీని , హైదరాబాద్‌లోని వ్యూహాత్మక ప్రాంతాలపై మార్కెట్లో ఉన్న సానుకూల దృక్పథాన్ని ఈ ఫలితం ప్రతిబింబిస్తోంది. అలాగే, సంస్థాగత రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు తెలంగాణ ఒక కీలకమైన, వేగంగా అభివృద్ధి చెందుతున్న గమ్యస్థానంగా మారిందనడానికి ఇది నిదర్శనంగా నిలిచింది . ఈ ఫలితం రాయదుర్గం ప్రాంతంలో భూముల విలువలు గణనీయంగా పెరిగాయని సూచిస్తోంది. టీజీఐఐసీ గతంలో నిర్వహించిన వేలంలో ఎకరాకు రూ. 237 కోట్ల ధర లభించగా, ఇప్పుడు ప్లాట్ P1 విషయంలో ఆ రికార్డును అధిగమించి ఎకరాకు రూ. 264 కోట్ల ధర పలికింది. ఈ ప్రాంతంలోని అత్యుత్తమ శ్రేణి ప్లాట్ల పట్ల పెట్టుబడిదారులకు ఉన్న నిరంతర ఆసక్తిని ఇది స్పష్టం చేస్తోంది.
ఈ వేలం ప్రక్రియ ఎంఎస్టీసీ ఈ-వేలం ప్లాట్‌ఫారమ్ ద్వారా నిర్వహించారు. జేఎల్ఎల్ సంస్థ ప్రత్యేక లావాదేవీ సలహాదారుగా వ్యవహరించడం ద్వారా పారదర్శకతను కల్పించడంతో పాటు, ప్రముఖ జాతీయ స్థాయి డెవలపర్లు పోటీతత్వంతో ఇందులో పాల్గొనేలా చేసింది. ప్లాట్ P1 వేలం విజయవంతం కావడం అనేది తెలంగాణ భవిష్యత్తుపై డెవలపర్ వర్గానికి ఉన్న నమ్మకాన్ని , దృఢ విశ్వాసాన్ని తెలియ జేస్తోంది అని అన్నారు శశాంక. మనం చూస్తున్నది కేవలం అధిక ధరలు మాత్రమే కాదు, రాష్ట్ర అభివృద్ధి విధానానికి లభించిన స్పష్టమైన ఆమోదం కూడా. ఈ విధానం పారదర్శకత, అత్యుత్తమ మౌలిక సదుపాయాలు , వాటాదారులందరికీ నిజమైన విలువను కల్పించడం అనే అంశాలపై ఆధారపడి ఉంది.వేలం ప్రక్రియలో పాల్గొన్న వారి నాణ్యత , ప్రదర్శించిన పోటీతత్వం… హైదరాబాద్ నిజమైన ప్రపంచ స్థాయి వ్యాపార కేంద్రంగా రూపాంతరం చెందడాన్ని మార్కెట్ గుర్తిస్తోందనడానికి నిదర్శనంగా నిలిచాయి అన్నారు.
