సరిహద్దు భద్రత, డార్జిలింగ్ సమస్యలపై అమిత్ షా ఫోకస్
శాశ్వత పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకుంటాం
పశ్చిమ బెంగాల్ : వ్యూహాత్మకంగా కీలకమైన సిలిగురి కారిడార్ భద్రత, డార్జిలింగ్ కొండ ప్రాంతాల దీర్ఘకాలిక సమస్యలకు శాశ్వత రాజకీయ పరిష్కారం వంటి అంశాలు ప్రధాన ఎజెండాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా శనివారం ఇక్కడ వరుస సమావేశాలు నిర్వహించారు. హోం మంత్రి అధికారిక పర్యటన వివరాల ప్రకారం తన మూడు రోజుల పశ్చిమ బెంగాల్ పర్యటనలో చివరి రోజున సిలిగురి పట్టణ శివార్లలోని సుక్నాలో ఆయన బస చేసిన హోటల్లో ఉదయం 11 గంటల నుండి రెండు వరుస సమావేశాలకు షా అధ్యక్షత వహించారు. మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో బాగ్డోగ్రా విమానాశ్రయం నుండి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. బీఎస్ ఎఫ్ , ఎస్ఎస్ బీ నిఘా సంస్థలు , రాష్ట్ర యంత్రాంగం మధ్య సమన్వయంపై దృష్టి సారిస్తూ షా సరిహద్దు భద్రతను సమీక్షించారు. నేపాల్, భూటాన్ , బంగ్లాదేశ్ అంతర్జాతీయ సరిహద్దులకు సిలిగురి దగ్గరగా ఉండటం, ఈశాన్య ప్రాంతాన్ని దేశంలోని మిగిలిన ప్రాంతాలతో కలిపే ఇరుకైన కారిడార్‌కు ఉన్న వ్యూహాత్మక ప్రాముఖ్యత దృష్ట్యా ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.
డార్జిలింగ్ కొండ ప్రాంతాల దీర్ఘకాలిక రాజకీయ సమస్యలపై చర్చించడానికి షా అక్కడి ప్రజా ప్రతినిధులు ,రాజకీయ నాయకులను కూడా కలవడం ఒకింత ఆశ్చర్య పోయేలా చేసింది. గూర్ఖా వర్గం, కొండ ప్రాంతాల ఇతర నివాసితులకు శాశ్వత రాజకీయ పరిష్కారం కల్పిస్తామని ఎన్నికలకు ముందు బీజేపీ ఇచ్చిన హామీపై ఈ సమావేశం దృష్టి సారించింది. గూర్ఖా జనముక్తి మోర్చా అధ్యక్షుడు బిమల్ గురుంగ్ , ప్రధాన కార్యదర్శి రోషన్ గిరి తదితర నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో బీజేపీకి చెందిన డార్జిలింగ్ ఎంపీ రాజు బిస్తా, అలాగే ఆ ప్రాంతానికి చెందిన రాష్ట్ర మంత్రులు , శాసనసభ్యులు కూడా పాల్గొన్నారు. దశాబ్దాలుగా ఈ కొండ ప్రాంతాల్లో ప్రత్యేక ‘గోర్ఖాలాండ్’ రాష్ట్రం కోసం డిమాండ్లు వినిపిస్తూనే ఉన్నాయి. గత ప్రభుత్వాలు ‘డార్జిలింగ్ గోర్ఖా హిల్ కౌన్సిల్’ ‘గోర్ఖాలాండ్ టెరిటోరియల్ అడ్మినిస్ట్రేషన్’ వంటి ఏర్పాట్ల ద్వారా ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించాయి.
