మహాబలిపురం : ఖమ్మం జిల్లాలోని భద్రాచలం పరిసర 5 గ్రామ పంచాయతీలను తెలంగాణలో విలీనం చేయాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కోరారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు. తమిళనాడులోని మహాబలిపురం వేదికగా జరిగిన 31వ దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశంలో ఇంఛార్జి సీఎం భట్టి విక్రమార్కతో పాటు తుమ్మల కూడా పాల్గొన్నారు. తెలంగాణ ప్రయోజనాలపై లేఖల ద్వారా మంత్రి తుమ్మల విన్నవించారు. ఆయిల్ పామ్ గెలల ధర 25000 గా నిర్ణయించేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు సహకరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కోరారు. పెద్దవాగు పునరుద్ధరణకు నిధులు విడుదల చేయాలని, భద్రాచలం – ఏలూరు రహదారిని జాతీయ రహదారిగా ప్రకటించేలా కూడా కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. రాష్ట్ర విభజనతో మిగిలిన అంశాల పరిష్కారం, అంతర్రాష్ట్ర సమస్యలకు శాశ్వత పరిష్కార మార్గాలపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. భద్రాచలం పరిసరాల్లోని ఐదు గ్రామ పంచాయతీలను తెలంగాణలో తిరిగి విలీనం చేయడం, పెద్దవాగు ప్రాజెక్టు శాశ్వత పునరుద్ధరణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన వాటా నిధులు అందించడం, ఆయిల్‌పామ్ రైతులకు కనీస హామీ ధర కల్పించడం, భద్రాచలం–ఏలూరు అంతర్రాష్ట్ర రహదారిని జాతీయ రహదారిగా ప్రకటించేలా కేంద్రంపై ఒత్తిడి తేవడం వంటి అంశాలపై ప్రస్తావించారు.
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో భద్రాచలం పట్టణానికి భౌగోళికంగా, పరిపాలనాపరంగా అత్యంత సమీపంలో ఉన్న ఐదు గ్రామ పంచాయతీలు ఆంధ్రప్రదేశ్‌లోనే కొనసాగడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రి తుమ్మల వాపోయారు. యాటపాక, కన్నాయిగూడెం, పిచ్చికలపాడు, పురుషోత్తపట్నం, గుండాల గ్రామ పంచాయతీల పరిధిలోని 19 రెవెన్యూ గ్రామాలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తిరిగి విలీనం చేయాలని కోరారు. ఈ గ్రామాల మొత్తం భౌగోళిక విస్తీర్ణం 11,122.01 ఎకరాలుగా లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ గ్రామాలు తెలంగాణ భూభాగాల మధ్య, గోదావరి నది, రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాల మధ్య ఒక ప్రత్యేక భౌగోళిక పరిస్థితిలో ఉండటంతో ప్రజలకు పరిపాలనా సేవలు పొందడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని మంత్రి వివరించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం సుమారు 282 కిలోమీటర్ల దూరంలో ఉండగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం కేవలం 40 కిలోమీటర్ల దూరంలోనే ఉందని తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తులు, అటవీ ఉత్పత్తులు, నిత్యావసర వస్తువుల రవాణాలో అంతర్రాష్ట్ర చెక్‌పోస్టుల కారణంగా గిరిజన ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
అదేవిధంగా ఛత్తీస్‌గఢ్, ఒడిశా సరిహద్దులకు సమీపంలో, గతంలో నక్సల్ ప్రభావిత ప్రాంతంగా ఉన్న ఈ ప్రాంతంలో పోలీసు, భద్రతా వ్యవస్థల మధ్య సమన్వయానికి కూడా ప్రస్తుత భౌగోళిక పరిస్థితి సమస్యగా మారుతోందని మంత్రి తెలిపారు. భద్రాచలం శ్రీ సీతా రామచంద్రస్వామి ఆలయం తెలంగాణలో ఉండగా, ఆలయానికి సంబంధించిన గణనీయమైన భూములు పురుషోత్తపట్నంలో ఉండటం వల్ల ఆలయ పరిపాలనలోనూ ఇబ్బందులు తలెత్తుతున్నాయని వివరించారు. ఈ అంశంపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను జోక్యం చేసుకొని, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ అనంతరం ఏర్పడిన భౌగోళిక అసమానతను సరిదిద్దేలా ఐదు గ్రామ పంచాయతీలను, వాటి పరిధిలోని 19 రెవెన్యూ గ్రామాలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తిరిగి చేర్చే ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం గుమ్మడవల్లి వద్ద ఉన్న పెద్దవాగు మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టు 2024 జూలై 18న కురిసిన భారీ వర్షాలకు తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో శాశ్వత పునరుద్ధరణ పనులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన వాటా నిధులను వెంటనే అందించాలని అన్నారు.
ఈ ప్రాజెక్టు ద్వారా మొత్తం 16,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుండగా, అందులో 13,640 ఎకరాలు ఆయకట్టు ఆంధ్రప్రదేశ్‌లోనే ఉందని, ప్రాజెక్టు దెబ్బతిన్న వెంటనే తెలంగాణ ప్రభుత్వం రింగ్‌బండ్ నిర్మాణం సహా తాత్కాలిక పునరుద్ధరణ చర్యలు చేపట్టి రెండు రాష్ట్రాల ఆయకట్టుకు నీరందేలా చర్యలు తీసుకుందని తెలిపారు. అయితే శాశ్వత పునరుద్ధరణకు రూ.92.20 కోట్లు అంచనా వేయడం జరిగిందని, ఆంధ్రప్రదేశ్‌లోనే 85.25 శాతం ఆయకట్టు ఉన్నందున, శాశ్వత పునరుద్ధరణ వ్యయాన్ని నిష్పత్తి ప్రాతిపదికన పంచుకొని అవసరమైన నిధులను వెంటనే విడుదల చేయాలని మంత్రి చంద్రబాబు నాయుడిని కోరారు. ఈ అంశంపై గత ఫిబ్రవరిలోనే విజ్ఞప్తి చేసినప్పటికీ నిర్ణయం పెండింగ్‌లో ఉందని, రైతుల ప్రయోజనాల దృష్ట్యా తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయిల్‌పామ్ సాగు రైతుల ఆదాయ భద్రత కోసం ఆయిల్ పామ్ గెలల (FFBs) టన్నుకు కనీస హామీ ధర రూ.25,000గా నిర్ణయించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా సహకరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. ఆయిల్‌పామ్ సాగులో ప్రారంభ పెట్టుబడి అధికంగా ఉండటంతో పాటు పంటకు ఆదాయం రావడానికి ఎక్కువ కాలం పడుతుందని, అంతర్జాతీయ క్రూడ్ పామ్ ఆయిల్, ఎడిబుల్ ఆయిల్ ధరల్లో హెచ్చుతగ్గులు రైతుల ఆదాయంపై ప్రభావం చూపుతున్నాయని మంత్రి వివరించారు.
