చెన్నై : ఎన్ఎల్సీ విషయంలో రైతుల పక్షాన టీవీకే ప్రభుత్వం నిలబడుతుందని ప్రకటించారు మంత్రి కీర్తన. ప్రాజెక్టుల కోసం తమ భూములు, ఇళ్లను అప్పగించిన కడలూరు జిల్లా రైతులు , వ్యవసాయ కూలీలు ఎదుర్కొంటున్న నిరంతర సమస్యలను ప్రస్తావిస్తూ ఏఐడీఎంకే ఎమ్మెల్యే అరుల్ మొళిదేవన్ ప్రవేశపె ట్టిన తీర్మానంపై ఈ చర్చ జరిగింది. ఎన్ఎల్సీ ఇండియా లిమిటెడ్ చుట్టూ నెలకొన్న సమస్యల విషయంలో స్థానిక రైతులు, ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, ఒకవేళ ఆ ప్రభుత్వ రంగ సంస్థ నిబంధనలను ఉల్లంఘించినా లేదా ప్రజా సంక్షేమానికి విరుద్ధంగా వ్యవహరించినా కఠిన చర్యలు తీసుకుంటామని పరిశ్రమల శాఖ మంత్రి కీర్తన అసెంబ్లీలో హామీ ఇచ్చారు. పునరావాస పథకాలను వేగవంతం చేయడానికి , గని వ్యర్థాల కుప్పలు కూలి పోవడం వల్ల వ్యవసాయ పొలాలకు జరిగిన భారీ నష్టాన్ని పరిష్కరించడానికి అత్యవసరంగా ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
తగిన పరిహారం లేదా దీర్ఘకాలిక ఉపశమనం లభించక చుట్టుపక్కల అనేక గ్రామాలు ఇంకా ఇబ్బందులు పడుతున్నాయని పేర్కొంటూ డీఎండీంకే నాయకురాలు ప్రేమలత విజయకాంత్ ఈ డిమాండ్‌కు మద్దతు తెలిపారు. చర్చలో పాల్గొన్న పీఎంకకే ఎమ్మెల్యే సౌమ్య అన్బుమణి ఎన్ఎల్సీఐఎల్ కు సంబంధించి కార్పొరేట్ సామాజిక బాధ్యత వ్యయంపై తీవ్ర విమర్శలు చేశారు; కేటాయించిన నిధులు నిజంగా స్థానిక ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తున్నాయా లేక కేవలం కంపెనీ అంతర్గత విస్తరణకే ఉపయోగప డుతున్నాయా అని ఆమె ప్రశ్నించారు. భూములు ఇచ్చిన రైతుల పిల్లలకు ప్రత్యక్ష ఉద్యోగాలు లేదా వృత్తిపరమైన శిక్షణ ఇవ్వడానికి బదులుగా సదరు సంస్థ పోటీ పరీక్షల ద్వారా బయటి అభ్యర్థులను నియమించు కుంటోందని ఆమె స్థానిక ఉపాధి సమస్యను లేవనెత్తారు. ఆ ప్రాంతంలో భూగర్భ జలాలు తీవ్రంగా తగ్గిపోవడం , పర్యావరణం దెబ్బతినడం వంటి అంశాలపై కూడా ఆమె దృష్టిని సారించారు.
దీనికి స్పందిస్తూ మంత్రి కీర్తన మొదట ఎన్ఎల్ సీఎల్ అందించిన సాంకేతిక వివరణలను సభ ముందు ఉంచారు; చుట్టుపక్కల వ్యవసాయ భూముల భద్రతకు కంపెనీ ప్రాధాన్యత ఇస్తుందని, 2015 వరదల తర్వాత చేపట్టిన రక్షణ చర్యల అనంతరం ఎటువంటి గట్లు తెగడం, పొంగిపొర్లడం లేదా మట్టి కుప్పలు కూలిపోవడం వంటి సంఘటనలు నమోదు కాలేదని ఆమె తెలిపారు. అయితే, అరుల్‌మొళిదేవన్ ఈ వాదనలను తప్పుదోవ పట్టించేవిగా కొట్టి పారేశారు; 2019 నుండి బాధిత రైతులకు ఎటువంటి పరిహారం అందలేదని పేర్కొంటూ, స్వతంత్ర విచారణ అవసరాన్ని మరోసారి నొక్కి చెప్పారు.
దీంతో ప్రభుత్వం రైతులకు అనుకూలంగా వ్యవహరిస్తుందని కీర్తన సభకు హామీ ఇచ్చారు.
