ప్ర‌పంచ విద్యా కేంద్రంగా హైద‌రాబాద్ : సీఎం

లండ‌న్ ప‌ర్య‌ట‌న‌లో విశ్వ విద్యాల‌యం సంద‌ర్శ‌న

లండ‌న్ : హైద‌రాబాద్ ను ప్ర‌పంచ విద్యా వేదిక‌గా మారుస్తామ‌ని అన్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. విదేశీ ప‌ర్య‌ట‌నలో భాగంగా ఆయ‌న లండ‌న్ లో ఆక్స్ ఫ‌ర్డ్ విశ్వ విద్యాల‌యాన్ని సంద‌ర్శించారు. విద్య, పరిశోధన, ఆవిష్కరణలు, పెట్టుబడుల విషయంలో తెలంగాణను ఒక ప్రపంచ గమ్యస్థానంగా నిలపాలన్నది త‌మ ల‌క్ష్య‌మ‌న్నారు. బాలియోల్ కళాశాలకు చెందిన ప్రొఫెసర్ ఫైసల్ దేవ్జీలతో చర్చలు జరిపారు. తెలంగాణను అన్ని రంగాల‌లో టాప్ లో నిలిపేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌న్నారు. అందులో ప్ర‌ధానంగా విద్యా రంగాన్ని మ‌రింత బ‌లోపేతం చేసేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టామ‌న్నారు సీఎం. ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కార్యక్రమాలు, ప్రత్యేక పరిశోధనా సామర్థ్యాలు , గొప్ప విద్యా పర్యావరణ వ్యవస్థను హైదరాబాద్‌కు తీసుకు రావడాన్ని పరిశీలించాలని, అలాగే నగరంలో ఒక ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు నిర్ణ‌యం తీసుకోవాల‌ని కోరారు. ముఖ్యమంత్రి కార్యాలయ సలహాదారు, ఎక్స్-అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు కేంద్ర ప్రభుత్వ జాతీయ విద్యా విధానం కింద విదేశీ విశ్వ విద్యాలయాలకు అందుబాటులో ఉన్న అవకాశాలపై సవివరంగా ప్రజెంటేషన్ ఇచ్చారు. హైదరాబాద్ , తెలంగాణలో విద్యా సంస్థలను స్థాపించడం వల్ల కలిగే వ్యూహాత్మక ప్రయోజనాలను ప్రముఖంగా ప్రస్తావించారు.

ప్రొఫెసర్లు ట్యూడర్ , దేవ్జీ ఈ ప్రతిపాదనలకు సానుకూలంగా స్పందించారు. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేయడానికి అనేక సంభావ్య రంగాలను గుర్తించారు. డిసెంబర్ 7, 8, 9 తేదీలలో హైదరాబాద్‌లో జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో పాల్గొనవలసిందిగా ఆహ్వానించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి మాజీ ప్రధాని ఇందిరా గాంధీ చదువుకున్న సోమర్‌విల్ కళాశాలలో ఉన్న ఆమె చిత్రపటాన్ని సందర్శించారు. జీఎంఆర్ గ్రూప్ కార్పొరేట్ ఛైర్మన్ కిరణ్ కుమార్ గ్రంధితో కలిస జీఎంఆర్ గ్రూప్ నిర్వహిస్తున్న యుటిలిటాబౌల్ ను సందర్శించారు. ఈ సమీకృత క్రీడా సదుపాయంలో గోల్ఫ్ కోర్సు, క్రీడా మౌలిక సదుపాయాలు, ఒక హోటల్ ఉన్నాయి. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని, అలాగే ప్రపంచ స్థాయి క్రీడా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంలో రాష్ట్రానికి భాగస్వాములు కావాలని జీఎంఆర్ గ్రూప్‌ను ఆహ్వానించారు.

Leave A Reply

Your Email Id will not be published!