సర్వే మ్యాప్‌ తో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం

ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు

జ‌గిత్యాల జిల్లా : అర్హులైన ప్రతి పేద కుటుంబానికి కులం, మతం, రాజకీయాలకు అతీతంగా ఇందిరమ్మ ఇల్లు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల రెండో విడతలో అర్హులైన లబ్ధిదారులను సెప్టెంబర్‌ 15లోగా తుది జాబితా సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సీసీఎల్‌ఏ కమిషనర్‌ లోకేష్‌కుమార్, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజీవ్‌గాంధీ హనుమంతు, హౌసింగ్‌ ఎండీ గౌతమ్, జిల్లా కలెక్టర్‌ బి. సత్యప్రసాద్ తదితరులతో కలిసి మంత్రి జగిత్యాల జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా నూతనంగా మంజూరైన జగిత్యాల, మెట్‌పల్లి ఆర్డీవో కార్యాలయాలు, భీమారం, ఎండపల్లి తహసీల్దార్‌ కార్యాలయాలు, మాల్యాల, మెట్‌పల్లి సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. మొత్తం ఆరు కార్యాలయాల నిర్మాణానికి రూ.11.80 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. ఆధునిక వసతులతో కార్యాలయాలను నిర్మించి ప్రజలకు మరింత వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించడమే ప్రభుత్వ ఉద్దేశమన్నారు.

జిల్లాలో మొదటి విడతలో 3,500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి సూచించారు. L1, L2, L3 వంటి సాంకేతిక వర్గీకరణల కంటే అర్హతకు ప్రాధాన్యత ఇవ్వాలని, నిజమైన పేదలకు ఇళ్లు అందేలా శాసనసభ్యులు, ఇన్‌చార్జి మంత్రులతో సమన్వయం చేసుకుని లబ్ధిదారులను ఎంపిక చేయాలని ఆదేశించారు. వచ్చే నెల సెప్టెంబర్‌ 15 నాటికి రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను కూడా తుది చేయాలని స్పష్టం చేశారు. అర్హులైన ఒక్క కుటుంబం కూడా మిగిలి పోకుండా మరోసారి దరఖాస్తులు స్వీకరించి, క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి పారదర్శకంగా ఎంపిక చేయాలని సూచించారు. ప్రభుత్వ ఆలోచనలు, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ప్రజాప్రతినిధులు, అధికారులను కోరారు.

రాష్ట్రంలో చేపడుతున్న భూ రీ సర్వే అత్యంత కీలకమైన కార్యక్రమమని మంత్రి పొంగులేటి అన్నారు. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే రీ సర్వే ప్రధాన లక్ష్యమని, అధికారులు పకడ్బందీగా సర్వే నిర్వహించాలని అన్నారు. సర్వే పూర్తయిన వెంటనే సంబంధిత భూ యజమానులకు మ్యాప్‌ అందిస్తే భవిష్యత్‌లో డిస్ప్యూట్‌లకు అవకాశం ఉండదని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్లు పూర్తి బాధ్యతతో చేపట్టాలని సూచించారు. ఇది రెవెన్యూ శాఖలో కొత్త శకానికి నాంది పలికే కార్యక్రమమని, కలెక్టర్లకు అనుభవంతో కూడిన ఉన్నత సవాలు అని అన్నారు. సర్వే నిర్వహించే సర్వేయర్లకు నిర్ణీత మొత్తాన్ని ప్రతి 15 రోజులకు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భూ సమస్యలు పెండింగ్‌లో లేకుండా వెంటనే పరిష్కరించాలని స్పష్టం చేశారు.

Leave A Reply

Your Email Id will not be published!