ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు గ్రామాలు సన్నద్ధం

వ్య‌వ‌సాయ శాఖ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావు

హైద‌రాబాద్ : ఎల్‌నినో ప్రభావంతో దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ముందస్తు కార్యాచరణతో సిద్ధంగా ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్ప‌ష్టం చేశారు. రైతాంగానికి, రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఇతర రాష్ట్రాల కంటే ముందుగానే ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక రూపొందించిందని పేర్కొన్నారు. రాజేంద్రనగర్‌లోని టీజీఐఆర్డీలో ఎల్‌నినో ప్రభావం, వివిధ ప్రభుత్వ రంగాల్లో చేపట్టాల్సిన ముందస్తు కార్యాచరణపై రాష్ట్రస్థాయి వర్క్‌షాప్‌ నిర్వహించారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, వాకిటి శ్రీహరి, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డి, సీఎస్‌ సంజయ్‌ జాజు, స్పెషల్‌ సీఎస్‌ దానకిషోర్‌, పంచాయతీరాజ్ కమిషనర్ దివ్య దేవరాజన్, వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్రమోహన్, అనిమల్ హస్బెండరు సెక్రటరీ ఇలమ్ బర్తి , టీజీఐఆర్డీ సీఈవో నిఖిల, హార్టికల్చర్ డైరెక్టర్ యాస్మిన్ భాష, వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండి కొర్ర లక్ష్మి, ఉన్నతాధికారులు, అదనపు కలెక్టర్లు, జిల్లా సీఈవోలు, డీఆర్డీవోలు, డీపీఓలు, వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్థక, మత్స్య శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఎల్‌నినో ప్రభావాన్ని కేవలం విపత్తుగా చూడకుండా ముందస్తు ప్రణాళికతో అవకాశంగా మలుచుకోవాలని సూచించారు. గ్రామస్థాయిలో ప్రతి శాఖకు విడివిడిగా కాకుండా వ్యవసాయం, ఉద్యానవనం, పశుసంవర్థక, మత్స్య, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖలు సమన్వయంతో పని చేయాలని అన్నారు. ప్రతి గ్రామానికి సమగ్ర అభివృద్ధి ప్రణాళిక రూపొందించి, స్వల్పకాలిక అవసరాలతో పాటు వచ్చే ఐదు, పది సంవత్సరాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని పనులను ఎంపిక చేయాలని సూచించారు. వీబీ-జీ రామ్‌జీ నిధులను యాదృచ్ఛికంగా కాకుండా ప్రణాళికాబద్ధంగా వినియోగించాలని, ఉపాధి హామీ నిధులతో శాశ్వత సామాజిక ఆస్తులను నిర్మించాలని పేర్కొన్నారు. నీటి సంరక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ప్రతి ఇంటికి ఇంకుడు గుంత, ప్రతి పంటకు పంట కుంట, ప్రతి గ్రామానికి ఊట కుంట వంటి పనులను విస్తృతంగా చేపట్టాలని అన్నారు. పంట కుంటల ద్వారా భూగర్భ జలాలు పెరగడంతో పాటు వ్యవసాయం, చేపల పెంపకం వంటి అనేక ప్రయోజనాలు కలుగుతాయని తెలిపారు.

గ్రామాభివృద్ధి ప్రణాళికలు ప్రజల భాగస్వామ్యంతో, గ్రామసభల నుంచే రూపొందాలని, ప్రతి పనికి జియో ట్యాగింగ్‌ చేయాలని, ఒక్క రూపాయి కూడా వృథా కాకుండా అధికారులు పనిచేయాలని సూచించారు. ఎక్కువ మంది ప్రజలకు ఉపయోగపడే, ఒకే పనితో అనేక ప్రయోజనాలు కలిగే పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!