సంక్షేమ ప‌థ‌కాల‌కు నిధుల కొర‌త లేదు : అడ్లూరి

అత్య‌వ‌స‌రంగా రూ. 42 కోట్ల నిధులు విడుద‌ల చేస్తాం

ఆదిలాబాద్ జిల్లా : రాష్ట్ర గిరిజ‌న సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ కుమార్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.ఉట్నూర్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ పథకాలపై స‌మీక్ష చేప‌ట్టారు. ఉట్నూరు ఐటీడీఏకు అత్య‌వ‌స‌రంగా రూ. 42 కోట్లు మంజూరు చేయిస్తామ‌ని, ఈ విష‌యాన్ని సీఎం దృష్టికి తీసుకు వెళ‌తాన‌ని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ , బీసీ వర్గాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎస్సీ, ఎస్టీ , దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి స్పష్టం చేశారు. ఐటీడీఏ పరిధిలోని గిరిజనుల సంక్షేమ పథకాలకు నిధుల కొరత ఉంద‌న్న విష‌యం త‌న‌కు తెలుస‌న్నారు. సంక్షేమం, అభివృద్ధికి నిధులు అవసరం అని ఆయన నొక్కి చెప్పారు. అంతకు ముందు లక్ష్మణ్ కుమార్ ఖానాపూర్ ఎమ్మెల్యే వేద్మ బొజ్జు, ఎమ్మెల్సీ దండే విఠల్, కలెక్టర్ రాజర్షి షా , ప్రాజెక్ట్ అధికారి మంద మకరందుతో కలిసి ఉట్నూర్లోని ఆశ్రమ గిరిజన బాలికల పాఠశాల విద్యార్థులకు పాఠశాల యూనిఫాంలు, బ్యాగులు , దుప్పట్లను పంపిణీ చేశారు.

అనంతరం మంత్రి ఒక తరగతి గదిలో IF ప్యానెల్‌ను ప్రారంభించి, విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. కేంద్రం నుండి అందిన నిధులకు సంబంధించిన వినియోగ ధృవీకరణ పత్రాలను సమర్పించాలని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ గిరిజన సంక్షేమ శాఖ ఉన్నతాధికారులను కోరారు. దీనివల్ల గిరిజనులు, ఎస్సీల సంక్షేమం, అభివృద్ధి కోసం నియోజకవర్గానికి అదనపు నిధులు పొందే అవకాశం ఉంటుందన్నారు. ROFR, పోడు సాగు, అటవీ, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ , ఎమ్మెల్సీ దండే విఠల్ మంత్రిని కోరారు. అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనులు , గిరిజనేతరులను వేధించవద్దని అటవీ శాఖ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ సంతోష్, గురుకుల పాఠశాలల కార్యదర్శి సీతా మహాలక్ష్మి, ఎస్సీ , బీసీ కార్పొరేషన్ల వైస్ చైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మల్లయ్య భట్టు, సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ కార్యదర్శి శారద తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!