హైదరాబాద్ : హైడ్రా కమిషనర్ ఎ.వి. రంగనాథ్ హైదరాబాద్ నగరంలో చేపట్టిన చెరువుల పునరుద్ధరణ పనుల రెండో దశను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆయన బాచుపల్లిలోని ఎర్రకుంట, నిజాంపేటలోని తుర్క్ చెరువు, మూసాపేటలోని కాముని చెరువుల అభివృద్ధి పనులను తనిఖీ చేశారు. చెరువు పునరుద్ధరణ పనులు జరుగుతున్న తీరు పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. చెరువుల్లో పూడికతీత పనులను పూర్తి స్థాయిలో చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా బాచుపల్లిలోని ఎర్రకుంట నుండి కాత్వకుంటకు మురుగు నీరు , వరద నీటి కాలువల అనుసంధానం లేక పోవడం వల్ల జీపీఆర్ లేఅవుట్ అంతా మురుగు నీటితో నిండి పోతోందని స్థానికులు కమిషనర్ దృష్టికి తీసుకు వచ్చారు. జీపీఆర్ లేఅవుట్‌లో కాలువ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ విషయాన్ని సీఎంసీ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎర్రకుంటను పూర్తిగా అభివృద్ధి చేస్తే మురుగు నీటిని మళ్లించడానికి ఈ కాలువలు కూడా అవసరమవుతాయని పేర్కొన్నారు.
నిజాంపేటలోని తుర్క్ చెరువు పరిసరాల్లో అనేక ఆలయాలు ఉన్నాయని, వాటన్నింటినీ ఒకే చోటుకు చేర్చేలా చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ కమిషనర్ తెలిపారు. స్థానికులతో పాటు ఆలయ కమిటీ ప్రతినిధులతో త్వరలో సమావేశం ఏర్పాటు చేసి, తదనుగుణంగా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. తుర్క్ చెరువు నుండి వరద నీరు పాపయ్యకుంటకు చేరేలా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు ఏవీ రంగనాథ్. చెరువులోకి మురుగునీరు చేరకుండా ఉండేందుకు మళ్లింపు చర్యలు చేపడుతున్నామని, సుమారు 1,200 మీటర్ల పొడవైన పైప్‌లైన్‌ను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. అలాగే ఇక్కడ చెరువు పూర్తి నీటి మట్టం పరిధిలో ఉన్న తాత్కాలిక షెడ్లను తొలగించాలని ఆయన సూచించారు. అనంతరం హైదరాబాద్ కమిషనర్ మూసాపేటలోని కాముని చెరువును కూడా పరిశీలించారు. చెరువులో పేరుకు పోయిన మురుగు నీరు , దుర్వాసనను తొలగించడం వల్ల దోమల బెడద తగ్గిందని స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చెరువును పూర్తిగా అభివృద్ధి చేస్తే అది ఎంతో ఆహ్లాదకరంగా మారుతుందని హైదరాబాద్ కమిషనర్ స్థానికులతో అన్నారు.
