ఆంధ్రప్రదేశ్‌ను గ్లోబల్ టూరిజం హబ్‌గా తీర్చిదిద్దుతాం

ఐఏటీఓ సదస్సులో మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం

విశాఖపట్నం జిల్లా : భారతదేశంలో ఉన్న అద్భుతాలన్నీ ఏపీలోనే ఉన్నాయని, ఈ నేపథ్యంలో ఏపీ ఇచ్చే మధురమైన అనుభూతులను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పర్యాటకులకు పంచుదామని పర్యాటక ప్రతినిధులకు పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. విశాఖపట్నంలోని ‘నోవోటెల్’ వేదికగా జరుగుతున్న ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ 41వ వార్షిక సదస్సు రెండో రోజు కార్యక్రమంలో భాగంగా మంత్రి పలువురు ప్రముఖ టూర్ ఆపరేటర్లు, హోటల్ ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు కేంద్ర పర్యాటక శాఖ అదనపు డైరెక్టర్ జనరల్ సుమన్ బిల్లా . అంతకు ముందు పర్యాటక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్.ఎస్. రావత్, టూరిజం ఎండీ పట్టాన్ శెట్టి రవి సుభాష్ రాష్ట్రంలో నూతన పర్యాటక విధానం 2024-19 ద్వారా అందిస్తున్న పెట్టుబడి అనుకూల అవకాశాలు, ప్రాధాన్యతలను ఆపరేటర్లకు సమగ్రంగా వివరించారు.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ‘స్ట్రాంగర్ టుగెదర్’ అనే నినాదంతో మేమంతా ముందుకు సాగుతున్నాం అన్నారు. రాబోయే గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని శైవ క్షేత్రాలు, దివ్య క్షేత్రాలు, పంచారామాలు, గోదావరి పరివాహక ప్రాంతాలు, సమీప ప్రాశస్త్యం ఉన్న ఆలయాలను అనుసంధానిస్తూ అద్భుతమైన ఆధ్యాత్మిక టూర్ ప్యాకేజీలను సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. టూర్ ఆపరేటర్లు, విమానయాన సంస్థలు, హోటల్ యాజమాన్యాలు పర్యాటక శాఖతో చేతులు కలిపి సరికొత్త, ఆకర్షణీయమైన టూర్ ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకు రావాలని కోరారు. అలాగే పర్యాటకులకు ఆధ్యాత్మిక ప్రశాంతతను అందించేలా మరిన్ని పర్యాటక ప్యాకేజీలను రూపొందించి గోదావరి పుష్కరాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

సదస్సులో భాగంగా ‘లీలా గ్రూప్’ ప్రతినిధులు మంత్రి కందుల దుర్గేష్‌తో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రపంచస్థాయి 7 స్టార్ హోటళ్లను నెలకొల్పేందుకు లీలా గ్రూప్ యాజమాన్యం తమ సంసిద్ధతను వ్యక్తం చేసింది. రాష్ట్రంలో పర్యాటక రంగాభివృద్ధికి టూర్ ఆపరేటర్లు, ఆతిథ్య రంగా ప్రతినిధుల సహకారం అత్యంత కీలకమని ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!