అక్టోబ‌ర్ 1న‌ క‌రవు మండ‌లాల ప్ర‌క‌ట‌న : చంద్ర‌బాబు

సూక్ష్మ సేద్యం, ప్రకృతి సాగుకు అత్యధిక ప్రాధాన్యత

అమరావతి : రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులను శాస్త్రీయంగా అంచనా వేసి అక్టోబర్ 1న కరువు మండలాలను ప్రకటించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. కరువు మండలాలను గుర్తించడంతో పాటు ఎక్కడా పంట నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులపై ప్రతీ నెలా కేంద్రానికి నివేదికలు పంపించాలని నిర్దేశించారు. రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, కరువు ప్రభావం, వ్యవసాయ–ఉద్యాన పంటల పరిస్థితి, రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులు, పంటలను కాపాడేందుకు తీసుకోవాల్సిన తక్షణ చర్యలు, తాగునీటి సరఫరాపై క్యాంపు ఆఫసులో శనివారం ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. కరువు మండలాల గుర్తింపు ప్రక్రియలో భాగంగా ఆరు శాఖల నుంచి అందే సమాచారాన్ని పరిగణనలోకి తీసుకుని వర్షపాతం, పంటల సాగు పరిస్థితి, భూగర్భ జలాలు, నేలలో తేమ శాతం, శాటిలైట్ చిత్రాలు, జలాశయాల్లో నీటి నిల్వలు వంటి అంశాలను సమగ్రంగా పరిశీలిస్తున్నట్టు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

2026 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి రాష్ట్రంలోని 28 జిల్లాల్లో ప్రాథమిక అంచనా ప్రకారం మొత్తం 513 మండలాల్లో కరువు నెలకొందని ముఖ్యమంత్రికి తెలిపారు. వీటిలో 268 మండలాల్లో పరిస్థితి తీవ్రంగాను, 245 మండలాల్లో మోస్తరుగా ఉందన్నారు. కరువు పరిస్థితులపై క్షేత్రస్థాయి పరిశీలనను వ్యవసాయ శాఖ చేపడుతుందని చెప్పారు. జిల్లా కలెక్టర్ల మార్గదర్శకత్వంలో క్షేత్ర స్థాయి బృందాలు పంట నష్టం, దిగుబడి నష్టాన్ని పరిశీలిస్తాయని, అనంతరం వ్యవసాయ శాఖ క్షేత్ర పరిశీలన నివేదికను జిల్లా కలెక్టర్లకు సమర్పిస్తుందని చెప్పారు. కరువు ప్రతిపాదనలను రెవెన్యూ, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ శాఖకు జిల్లా కలెక్టర్లు సమర్పించాల్సి ఉంటుందన్నారు. దీనికి సెప్టెంబర్ 24 చివరి తేదీగా నిర్ణయించినట్టు వెల్లడించారు. ఈ ప్రతిపాదనలను సెప్టెంబర్ 29న రాష్ట్ర స్థాయి కమిటీ సమావేశంలో పరిశీలిస్తారని తెలిపారు.

ఉద్యాన పంటలు కాడటానికి ఇప్పటికే రూ.190 కోట్లు కేటాయించామని, వాటికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సమీక్షలో సీఎం అన్నారు. వర్షాభావ పరిస్థితులతో పాటు ఎల్‌నినో ప్రభావాన్ని కూడా అధికారులు వివరించారు. రాష్ట్రంలోని 21 జిల్లాల్లో 1,357 RSKల పరిధిలో ఉన్న పంటలు హై రిస్క్ కేటగిరీలో ఉన్నాయన్నారు. ఎల్‌నినోతో 17,916 హెక్టార్లలోని నారింజ, బత్తాయి, మామిడి, ఎర్ర మిరప, ఉల్లి, కూరగాయల పంటలు ప్రభావితం కానున్నాయని తెలిపారు. నీటి లభ్యత తగ్గుతున్న పరిస్థితుల్లో తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణాన్ని కాపాడేందుకు మైక్రో ఇరిగేషన్‌కు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ముఖ్యమంత్రి నిర్దేశించారు. ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ (APMIP) కింద రైతులకు సంబంధించిన నాలుగు కీలక సేవలను ‘మన మిత్ర’ వాట్సప్ గవర్నెన్స్ కింద అందుబాటులోకి తెచ్చినట్టు చెప్పారు. సూక్ష్మ సేద్యంతో పాటు ప్రకృతి సేద్యం వైపు రైతులను మళ్లించేలా చూడాలని సీఎం నిర్దేశించారు.

Leave A Reply

Your Email Id will not be published!